"బిల్లు" వినియోగదారుని చేతిలో వజ్రాయుధం..
Ens Balu
3
Vizianagaram
2020-12-24 17:48:31
ఏ వస్తువైనా కొనేటప్పుడు తప్పకుండా బిల్లు తీసుకోవాలని, అది వినియోగదారుని చేతిలో వజ్రాయుధం లాంటిదని జేసీ కిషోర్ కుమార్ అన్నారు. బిల్లు ఇవ్వకపోతే అస్సలు వస్తువులు కొనొద్దని, బిల్లు అడిగి తీసుకోవడం వినియోగదారుని హక్కు అని పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌరసరఫరాల శాఖల ఆధ్వర్యంలో దాసన్నపేట రైతు బజారులో గురువారం 34వ జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ కిషోర్ కుమార్ ఈ సందర్భంగా వినియోగదారులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి వినియోగదారుడూ వినియోగదారుల పరిరక్షణ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, నిత్య జీవితంలో దానిని సమృద్ధిగా వినియోగించుకోవాలని సూచించారు. అమ్మకం దారులు లాభార్జనే ప్రధానం కాకుండా, నాణ్యమైన వస్తువును వినియోగదారుడికి అందజేయాలని అప్పుడే ఆరోగ్యకరమైన సమాజం నిర్మితమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వినియోగదారుడు, కొనుగోలుదారుడు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అప్పుడే వినియోగదారుల చట్టం ఫలాలు అందుతాయని అన్నారు. తూనికలు కొలతలు, ఆహార నియంత్రణ, పౌరసరఫరాల శాఖల అధికారులు భాద్యతగా వ్యవహరించి వినియోగదారుడికి మంచి సరుకు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక సభ్యుడిని నియమించి అతని ద్వారా ప్రజా ఫిర్యాదులు స్వీకరించే వెసులుబాటు త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా వినియోగదారుడికి సత్వర న్యాయం అందుతుందని, సత్ఫలితాలు చేకూరుతాయని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా వినియోగదారుల సేవా కేంద్రం అధ్యక్షుడు చదలవాడ ప్రసాదరావు, డి.ఎస్.వో. పాపారావు, పౌర సరఫరాల డి.ఎం. వరకుమార్, మార్కెటింగ్ శాఖ ఎ.డి. శ్యామ్ కుమార్, ఆహార నియంత్రణ అధికారి ఈశ్వరి, లీగల్ మెట్రోలజీ అధికారి జగన్నాథరావు, డీలర్లు, వినియోగదారులు, రైతు బజార్ అధికారులు, మార్కెటింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.