ఇంత పెద్ద స్థాయిలో ఇళ్ల స్థలాల పంపిణీ ఆమోఘం..
Ens Balu
1
Vizianagaram
2020-12-24 17:56:34
రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కలలు నెరవేరే రోజు ఆసన్నమయ్యింది. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఏ.పి. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాలు కార్యక్రమం వారి సొంతింటి కలల్ని సాకారం చేయనుంది. నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పేరుతో రాష్ట్రంలోని ప్రతి అర్హులైన నిరుపేదకు ఇంటి స్థలంతోపాటు ఇళ్లు నిర్మించుకొనేందుకు అవసరమైన ఆర్ధిక సహాయం అందించేందుకు రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా డిసెంబరు 25న జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, శాసనసభ్యులు ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభించిన అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఒక్క విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం ఈనెల 30న సి.ఎం. ప్రారంభిస్తారు.
జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన లబ్దిదారుల గుర్తింపు ప్రక్రియ ద్వారా జిల్లా యంత్రాంగం ఇళ్లులేని 71,249 నిరుపేద కుటుంబాలను గుర్తించి వారందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేసేందుకు అవసరమైన భూసేకరణ ఏర్పాట్లు చేసింది. వీరందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేసేందుకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1830.82 ఎకరాలను సేకరించారు. ఇందులో 1140 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించగా, 690.82 ఎకరాల ప్రైవేటు భూములను సేకరించారు. సుమారు రూ.228 కోట్లను ప్రైవేటు భూముల సేకరణకు ఇప్పటివరకు ఖర్చు చేశారు. సేకరించిన భూముల్లో 1164 లే అవుట్‌లు అభివృద్ధి చేసి లబ్దిదారులుగా గుర్తించిన వారందరికీ ఇళ్లస్థలాలు అందజేసేందుకు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం గత ఏడాది కాలంగా అన్ని ఏర్పాట్లు చేసింది. విజయనగరం డివిజన్‌లో 547, పార్వతీపురం డివిజన్‌లో 573 లే అవుట్‌లు అభివృద్ధి చేశారు. ఈ లే అవుట్‌లను ప్రైవేటు రియల్ ఎస్టేట్ లే అవుట్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో రోడ్లు, కమ్యూనిటీ స్థలాలు తదితర అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ఈ లేవుట్లలో మంజూరు చేసే ఇళ్ల పట్టాలన్నీ కుటుంబంలోని మహిళల పేరుతోనే అందించనున్నారు.
ఇళ్ల స్థలాలను మంజూరు చేయడంతో పాటు ఆయా స్థలాల్లో లబ్దిదారులకు ఇళ్లు కూడా మంజూరు చేస్తున్నారు. జిల్లాలో తొలివిడతగా 98,286 ఇళ్లు ఒక్కొక్కటి రూ.1.80 లక్షల వ్యయంతో మంజూరు చేస్తున్నట్టు జిల్లా గృహనిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరక్టర్ ఎస్.వి.రమణమూర్తి చెప్పారు. లబ్దిదారులు తామే సొంతంగా నిర్మించుకుంటే వారికి ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తామని, లేదంటే ఇంటి నిర్మాణ సామాగ్రి రూపంలో ప్రభుత్వ సహాయం కోరుకుంటే ఆవిధంగా సామాగ్రి అందజేస్తామని, లేక ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లబ్దిదారులు కోరుకుంటే నిర్మించి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రభుత్వం మంజూరు చేసిన లే అవుట్లతోపాటు, సొంత ఇంటి స్థలాలు కలిగి వుండి తమ స్థలంలోనే ఇళ్లు నిర్మించుకొనే వారికి కూడా ఇళ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు.
వీటితోపాటు గతంలోనే ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకొన్న 25,274 మంది నిరుపేదలకు వారు నిర్మించుకొన్న ఇళ్లకు పొసెషన్ సర్టిఫికెట్లను కూడా జారీచేయనున్నారు. ఏ.పి.టిడ్కో ద్వారా నిర్మించిన 8,048 ఇళ్లను కూడా పట్టణ ప్రాంత నిరుపేదలకు ఈ కార్యక్రమంలో భాగంగా కేటాయించనున్నారు. ఈ కార్యక్రమాలన్నింటి ద్వారా జిల్లాలో 1,08,230 నిరుపేద కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్రంలోని అతి పెద్ద లే అవుట్లలో ఒకటైన గుంకలాంలో 12,301 మందికి ఒకేచోట ఇళ్ల స్థలాలను కేటాయిస్తున్నారు. ఇక్కడి లేఅవుట్‌లో ఇళ్లస్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం కార్యక్రమాలను ప్రారంభించే నిమిత్తం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈనెల 30న జిల్లాకు వస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం గుంకలాం లే అవుట్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది.
నా కెరీర్‌లో మరచిపోలేను; జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్
జిల్లా చరిత్రలో ఇప్పటివరకు ఈ స్థాయిలో పేదలకు ఇళ్లస్థలాల పంపిణీ, ఇళ్లనిర్మాణ కార్యక్రమాలు చేపట్టలేదని, ఈ కార్యక్రమంలో తాను కూడా భాగస్వామి కావడం ఆనందంగా వుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ అన్నారు. రెవిన్యూ యంత్రాంగం ఇళ్లస్థలాల భూసేకరణను ఒక పెద్ద సవాలుగా తీసుకొని చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్‌గా వేలాది మంది నిరుపేదలకు ఇళ్లస్థలాలు అందించే అవకాశం ముఖ్యమంత్రి చేపట్టిన నవరత్నాలు కార్యక్రమం ద్వారానే తనకు లభించిందన్నారు. ఇదేవిధంగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తూ వేలాది గిరిజనులకు పట్టాలు అందించడం, సుమారు 5వేల మంది సచివాలయ సిబ్బందికి నియామకాలు జరపడం వంటివి తన జీవితకాలంలో మరచిపోలేనని అన్నారు.