ఆరోగ్య సమాజ నిర్మాణానికి యువత ముందుండాలి..


Ens Balu
3
Vizianagaram
2020-12-24 18:11:39

రెడ్ క్రాస్ సొసైటీ అందించే సేవల్లో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని, తద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడాలని సంయుక్త కలెక్టర్ జె.వెంకటరావు పిలుపునిచ్చారు. సేవా దృక్పథం, సామాజిక స్పృహ కలిగిన యువతరానికి రెడ్ క్రాస్ సొసైటీ ఒక చక్కని వేదిక అని పేర్కొన్నారు. జూనియర్ రెడ్ క్రాస్ మరియు యూత్ రెడ్ క్రాస్ సొసైటీల జిల్లా కమిటీ సమావేశం గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతరం సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని, సమాజంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. చిన్నప్పటి నుంచే సేవల వైపు దృష్టి సారించాలని, తద్వారా నైతిక బాధ్యతను నెరవేర్చాలని  హితవు పలికారు. అలాగే జిల్లాలో ఉన్న విద్యార్థులను, యువతను ప్రోత్సహించి రెడ్ క్రాస్ సొసైటీని బలోపేతం చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు సూచించారు. జిల్లాలో 369 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, 114 జూనియర్, 75 డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, వాటిల్లో ఉన్న విద్యార్థులను సొసైటీలో సభ్యులుగా చేర్చే ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. మండల స్థాయి కమిటీలను నియమించి రెడ్ క్రాస్ సేవలను విస్తృత పరచాలని హితవు పలికారు. రెడ్ క్రాస్ అంటే ఒక్క రక్త దానానికే కాదని, అన్ని సేవలకు చిరునామాగా నిలవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ విజయనగరం బ్రాంచ్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాదరావు, డి.ఎం.& హెచ్.వో. రమణ కుమారి, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు జోగా చంద్రశేఖర్ రావు, జి.ప్రభాకర్, మంత్రి రామ్మోహన్ రావు, సుబ్రహ్మణ్యం, బాలాజీ, శ్యామల, జయవర్ధన్, సురేఖ తదితరులు పాల్గొన్నారు.