కలెక్టర్ గంధం చంద్రుడికి వాసిరెడ్డి పద్మ కితాబు..


Ens Balu
1
Anantapur
2020-12-24 18:16:31

రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్  వాసిరెడ్డి పద్మ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా గురువారం ఉదయం స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ జిల్లా కలెక్టర్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో మహిళా సాధికారత, బాలికా విద్యను ప్రోత్సహిస్తూ ఉన్నామని, విద్యార్థుల ఆత్మ రక్షణ చర్యలను, గత కొద్ది రోజుల క్రితం బాలికే భవిష్యత్తు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, పాఠశాల నుండి కళాశాల స్థాయి వరకు చట్టాలపై అవగాహన సదస్సులు, బాల్యవివాహాల నిర్మూలన చర్యలు, జోగిని, బసివిని వ్యవస్థ పై అవగాహన కార్యక్రమాలు మరియు వారి ఆర్థిక అభివృద్ధి కొరకు చైతన్య కార్యక్రమాల నిర్వహణ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ స్పందిస్తూ జిల్లాలో "బాలికా భవిష్యత్తు చేపట్టిన కార్యక్రమం" కు జాతీయస్థాయిలో గుర్తింపు లభించిందని జిల్లా కలెక్టర్ ను  అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విజయలక్ష్మి, సిడబ్ల్యుసి చైర్మన్ నల్లాని రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.