తక్షణమే మంచినీటి కొళాయిలు వేయండి..
Ens Balu
3
Visakhapatnam
2020-12-24 18:39:14
జలజీవన్ మిషన్ లో భాగంగా ఇంటింటికి కొళాయి పనులను సత్వరమే ప్రారంభించాలని గ్రామీణ నీటి పారుదల శాఖ ఇంజనీర్లకు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి కేంద్ర ప్రభుత్వ జాతీయ జలజీవన్ మిషన్ కార్యక్రమం అమలుపై గ్రామీణాభివృద్ది శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. రూ 5లక్షల కంటే తక్కువ అంచనా విలువగల 1768 పనులను రూ 46.62 కోట్ల వ్యయంతో చేపట్ట నున్నట్లు తెలిపారు. ఈ పనులకు అవసరమైన మెటీరియల్ ను తక్షణమే ప్రోక్యూర్ చేయాలని, బిల్లులను ఐ ఎం ఐ ఎస్ లో అప్ లోడ్ చేయాలని తెలిపారు . అందుకు అవసరమైన గ్రామ పంచాయితీ తీర్మానాలను రేపటి లోగా అందజేయాలని స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు.
ప్రధాన మంత్రి ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న వీడియో కాన్పరెన్స్ లో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాల్గొంటారని అందువలన 28వ తేదీలోగా రూ 30 కోట్ల వ్యయాన్ని ఐ ఎం ఐ ఎస్ లో అప్ లోడ్ చేయాలని కోరారు.
జిల్లాలోని ఏజెన్సీ పరిధిలో అత్యధికంగా 1565 పనులు చేపట్ట నున్నందున ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి నిరంతర పర్యవేక్షించి లక్ష్యాలను చేరడానికి కృషి చేయాలని తెలిపారు. గ్రామీణ నీటి పారుదల శాఖ ఎస్ ఇ తో నిరంతరం సమన్వయం చేసుకొంటూ కార్యక్రమం అమలును పర్యవేక్షించాలని జాయింట్ కలెక్టర్ (ఆసరా ) ను కోరారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి , డి ఎల్ డి ఓ లు , డి ఎల్ పి ఓ లు, ఇ ఓ ఆర్ డి లు , ఎం పి డి ఓ లు, ఆర్ డబ్ల్యు ఎస్ ఇంజనీర్లు, శ్రద్ద వహించి పనులను సత్వరమే ప్రారంభించాలని తెలిపారు. అలాగే అంగన్ వాడీలు , పాఠశాలలలో పనులను కూడా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావు, గ్రామీణ నీటి సరఫరా పథకం ఎస్ ఇ రవికుమార్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.