25 నుంచి ఇళ్ల పట్టాల పంపిణీ పండగ..


Ens Balu
4
Anantapur
2020-12-24 19:39:54

అనంతపురం జిల్లాలో డిసెంబరు 25 వతేదీ నుంచి జిల్లాలో ఇళ్ల పట్టాల పంపిణీ పండగ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు పేర్కొన్నారు. జిల్లాలో పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఇళ్ల పట్టాల పంపిణీ పండగ కార్యక్రమం గురించి గురువారం స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్ లో జిల్లా కలెక్టర్ పాత్రికేయుల  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 25 నుంచీ జనవరి 7 వరకూ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో మొత్తం 2,19,552 మంది లబ్ధిదారులుండగా, అందులో 1045 లేఔట్లలో 1,23,961 ప్లాట్లకుగాను 1,23,961 లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాలు, టిడ్కో కింద మరో 15,525 పట్టాలు, ఇప్పటికే సొంత స్థలం ఉన్నవారికి అందజేసే పొజిషన్ సర్టిఫికెట్లను 79,860 మంది లబ్ధిదారులకు, రిజిస్టర్ అండర్ జీవో ఎంఎస్ నెంబర్ 463 కింద 194 మంది, రిజిస్టర్ అండర్ 11 ఆఫ్ 2019 కింద 12 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. అయితే 5471 పట్టాలకు సంబంధించి కోర్టు స్టే ఇచ్చినందువల్ల ఈనెల 25వ తేదీన శుక్రవారం మిగిలిన 2,14,081 మందికి పట్టాల పంపిణీ చేయనున్నామన్నారు.  అనంతపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో 94,114 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉండగా, ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో 28,053 మంది, పెనుగొండ నియోజకవర్గం పరిధిలో 39,104 మంది, కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్ పరిధిలో 28,602 మంది, కదిరి రెవెన్యూ డివిజన్ పరిధిలో 29,679 మంది లబ్ధిదారులతో కలుపుకొని మొత్తం జిల్లాలో 2,19,552 మంది లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారన్నారు. అందులో 5471 మంది లబ్ధిదారులకు సంబంధించి కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం లేదని, జిల్లాలో మిగిలిన 2,14,081 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అందులో అనంతపురం నియోజకవర్గ పరిధిలో మొత్తం 28,504 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే సింగనమల నియోజకవర్గ పరిధిలో 13,408 మందికి, తాడిపత్రి నియోజకవర్గ పరిధిలో 13,929 మందికి, గుంతకల్ పరిధిలో 18,741 మందికి, ఉరవకొండ పరిధిలో 13,033 మందికి, కళ్యాణదుర్గం పరిధిలో 12,343 మందికి, రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో 14,268 మందికి, పెనుకొండ పరిధిలో 13,117 మందికి, హిందూపురం పరిధిలో 12,911 మందికి, మడకశిర పరిధిలో 12,937 మందికి, ధర్మవరం పరిధిలో 17,666 మందికి, రాప్తాడు పరిధిలో13,653 మందికి, కదిరి పరిధిలో 11,398 మందికి, పుట్టపర్తి నియోజకవర్గం పరిధిలో 18,173 మంది అర్హులైన లబ్ధిదారులను కలుపుకొని జిల్లాలో మొత్తం 2,14,081 మంది లబ్ధిదారులకు శుక్రవారం ఇంటి పట్టాలు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో పేదలందరికీ ఇల్లు కింద ఇంటి పట్టాల పంపిణీ కోసం 2894.59 ఎకరాల భూమిని సిద్ధం చేయగా, అందులో 2029.67 ఎకరాలు ప్రభుత్వ భూమి అని, మిగిలిన 865 ఎకరాలకు పైగా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. పేదలందరికీ ఇల్లు పథకం కింద ఇంటి స్థలాల పంపిణీ కోసం 150.26 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇంటి పట్టాల కోసం సిద్ధం చేసిన లేఔట్ లలో బుస్ క్లియరెన్స్, మొక్కలు నాటడం, రాళ్లు పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం తదితర అన్ని రకాల అభివృద్ధి పనులు చేపట్టి 100 శాతం లేఔట్ లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారులకు ఇంటి పట్టాలు కేటాయించడం జరిగిందని తెలిపారు.  ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు, ఆశయాలకు రూపునిచ్చే విధంగా కులాలు, మతాల విభజనను చెరిపేస్తూ నిర్మించిన ఇంటిగ్రేటెడ్ లేఔట్లలో పేదలకు ప్లాట్లను అందిస్తున్నామన్నారు. లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ప్లాట్ల స్థలాల మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా నిబంధనలు రూపొందించమన్నారు. ప్లాట్లను తెలిసినవారితో, తెలియని వారితో ఇచ్చిపుచ్చుకునే అవకాశాలు ఉండవన్నారు. ప్రతి లేఔట్ వద్దా లబ్ధిదారులతో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి పారదర్శకత తీసుకొస్తామన్నారు. విశాలమైన రోడ్లు, పచ్చదనం నిండేలా మొక్కలతో ఆహ్లాదకరమైన లేఔట్లను ప్రజలకు అందిస్తామని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. హౌసింగ్, డ్వామా మరియు మునిసిపల్ నిధులు ఉపయోగించి భూముల అభివృద్ధి చేశామన్నారు.  ఇంటిగ్రేటెడ్ లేఔట్లు ఎలా ఉండనున్నాయో కలెక్టర్ వివరించారు. లేఔట్ ఫ్లెక్సీలో అర్హుల వివరాలను వర్గాల వారీగా రంగుల్లో తెలపనున్నామన్నారు. లేఔట్ ఫ్లెక్సీలలో జనరల్ అర్హులకు రాణీ రంగు, బీసీలకు ఆకుపచ్చ రంగు, ఎస్సీలకు నీలం రంగు లేఔట్లు, ఎస్టీలకు పసుపు పచ్చ రంగులు కేటాయించామన్నారు. ఎరుపు రంగులో ప్రభుత్వ అభివృద్ధి పనులకు కేటాయించిన భూమి కనిపిస్తుందన్నారు.  ఫ్లెక్సీలు చూస్తే అన్ని రంగులూ కలిసిపోయి ఉంటాయనీ.. ఆ రకంగా కులమతాల హద్దులు చేరిపేయనున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు.  నియోజక వర్గం వారీగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలతో పాటూ జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో పట్టాల పంపిణీ పండగ నిర్వహిస్తామన్నారు. అవినీతికీ, మధ్యవర్తులకూ తావు లేకుండా అర్హులందరికీ స్థానిక ప్రజాప్రతినిథి చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేయనున్నామన్నారు. ఈ డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. శుక్రవారం రోజు జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయా నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల చేత కార్యక్రమం ప్రారంభమవుతుందని, ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్న కార్యక్రమం అనంతరం ఆయా నియోజకవర్గాల్లో కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక నియోజకవర్గానికి ఒక స్పెషల్ అధికారి నియమించామని వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు.