స్నేహలత కుటుంబానికి రూ.10 నష్టపరిహారం..


Ens Balu
1
Anantapur
2020-12-24 19:53:19

అనంతపురం దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా  ఉంటుందని,  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి, చట్టపరంగా   వచ్చే సాయం తో పాటు అదనంగా సీఎంఆర్ఎఫ్  కింద 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారని   రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఒక ప్రకటన లో  తెలిపారు. ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద బుధవారం ఎస్బిఐ లో పొరుగు సేవల ఉద్యోగి స్నేహలత హత్యకు గురికాగా, వారి కుటుంబానికి పరిహారంగా చట్టప్రకారం వచ్చేవి కాకుండా, ముఖ్యమంత్రి  మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో అదనంగా రూ.10 లక్షల ఎక్గ్రేషియా ప్రకటించారని  మంత్రి, కలెక్టర్ తెలిపారు.  ఎలాంటి పక్షపాతం లేకుండా త్వరితగతిన కేసును దర్యాప్తు చేయాలని పోలీసు శాఖకు  ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. చట్టప్రకారం స్నేహలత కుటుంబానికి పరిహారంగా 8.25 లక్షల రూపాయలు రావాల్సి ఉండగా, అందులో తక్షణ సహాయంగా 4,12,500 రూపాయల ను అందజేస్తున్నామని,  ఇందుకు సంబంధించి ట్రెజరీ లో బిల్లు పాస్ అయి బ్యాంక్ కు వెళ్లిందని, గురువారం రాత్రి లోగా ఈ మొత్తాన్ని ఆ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.  మిగిలిన 4,12,500 రూపాయలను ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత అందజేస్తామన్నారు. బాధిత కుటుంబానికి పేదలందరికీ ఇళ్లు పథకంలో   భాగంగా ఇల్లు, ఇంటి స్థలం అందజేస్తామని, అలాగే  స్నేహలత కుటుంబంలో ఒకరికి  శాశ్వత ఉద్యోగం, 5 ఎకరాల పొలం అందిస్తామన్నారు.  స్నేహలత కుటుంబానికి మూడు నెలలపైగా సరిపడా  100 కేజీల బియ్యం, 20 కేజీల కందిపప్పు, 10 లీటర్ల నూనె, 10 కేజీల చక్కెర, ఇతర నిత్యావసర సరకులతో పాటు వంటపాత్రలు  అందించామన్నారు.   ప్రభుత్వం నుంచి స్నేహలత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ తెలిపారు.