నిరుపేదల ఇంటి సమస్యకు పరిష్కారం..
Ens Balu
3
చీపురుపల్లి
2020-12-25 18:38:01
ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా పేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి నెరవేర్చారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ననడుచుకొని, వారి ఆశలను నెరవేర్చే ప్రభుత్వం తమదని ఆయన స్పష్టం చేశారు. తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో శుక్రవారం 473 ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. అనంతరం లబ్దిదారులకు గృహనిర్మాణాన్ని ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి సందేశాన్ని వినిపించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పర్వదినం రోజు రాష్ట్రంలో 30లక్షల 78వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి శ్రీకారం చుట్టారని, వీరందరికి దశలవారీగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. లబ్దిదారులు తమకు నచ్చిన విధానంలో తమ ఇంటి నిర్మాణాన్ని చేసుకోవచ్చని, ప్రభుత్వం ఇచ్చిన మూడు అవకాశాలనూ వివరించారు.
ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకొనేందుకు ప్రతిపక్ష టిడిపి ఎన్నో కుయుక్తులు పన్నినప్పటికీ, వాటిని ఎదుర్కొని ఇన్నాళ్లకి పేదల కలలను నెరవేర్చామని చెప్పారు. ఒక్క చీపురుపల్లి నియోజకవర్గంలో మొత్తం 694 లేఅవుట్లను రూపొందించామని, సుమారు 6,323 మందికి పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం మొత్తం 103.50 ఎకరాల భూమిని సేకరించామని తెలిపారు. దీనిలో ప్రభుత్వ భూమి 87.50 ఎకరాలు కాగా, ప్రయివేటు భూమి 16 ఎకరాలు ఉందని చెప్పారు. దశలవారీగా అందరికీ ఇళ్లు నిర్మించడం జరుగుతందని తెలిపారు.
వైఎస్ రాజశేఖరెడ్డి తరువాత అంత జనరంజకంగా పాలిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్ మోహనరెడ్డికే దక్కిందన్నారు. ఎటువంటి సిఫార్సులకు, పక్షపాతానికి తావులేకుండా అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నామని, ఇప్పటికీ అర్హులెవరైనా దరఖాస్తు చేసుకుంటే, 90 రోజుల్లో పట్టాలు ఇస్తామని తెలిపారు. పేదలకు శాశ్వత భూ హక్కు కల్పించేందుకు, వారి భూములకు రక్షణ కల్పించేందుకు సమగ్ర భూ సర్వే చేపట్టామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపైనా ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని, అటువంటి వారిని ఊరి పొలిమేరలకు తరిమివేయాలని అన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మోసం చేశారని విమర్శించారు. తమ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే తొలివిడత రుణమాఫీ మొత్తాన్ని ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. లక్షా, 40వేల మందికి సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చి, దళారులు లేని కొత్త పాలనావ్యవస్థను శ్రీకారం చుట్టారని అన్నారు. కోడి కూయకముందే పింఛన్‌ను అందజేసి, పాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డికి దక్కిందని అన్నారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఒకేసారి 30 లక్షలమందికి పైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం, ఒకేవిడతలో 15లక్షల ఇళ్లు నిర్మాణాన్ని ప్రారంభించడం ఒక చారిత్రక ఘట్టమన్నారు. మిగిలిన 16లక్షల మందికి కూడా రెండోదశలో ఇంటి నిర్మాణం జరుగుతుందని చెప్పారు. సచివాలయ వ్యవస్థ ద్వారా, మహాత్మా గాంధీ కలలు గన్న గ్రామ స్వారాజ్య వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. దళారీలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందజేయడం జరుగుతోందని, ఇది ముఖ్యమంత్రి దూరదృష్టికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం, వారి సమస్యలు పరిష్కరించేందుకు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వైఎస్ఆర్ జలకళ పథకం ద్వారా వారి సాగుభూములకు నీటిని కూడా అందించే గొప్ప పథకాన్ని ముఖ్యమంత్రి తీసుకువచ్చారని బెల్లాన చెప్పారు.
జి.అగ్రహారం వద్ద నిర్మించిన కెజిబివి నూతన భవనాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జిసి కిశోర్ కుమార్, ఆర్‌డిఓ బిహెచ్ భవానీశంకర్, స్పెషల్ ఆఫీసర్ సాల్మన్ రాజు, హౌసింగ్ పిడి ఎస్‌వి రమణమూర్తి, డ్వామా పిడి ఏ.నాగేశ్వర్రావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఇతర నాయకులు, స్థానిక అధికారులు పాల్గొన్నారు.