ఇల్లు లేని పేదలందరికీ సొంతిళ్ళు..
Ens Balu
3
Pendurthi
2020-12-25 20:09:53
రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ సొంత ఇల్లు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పర్యాటకశాఖ మంత్రి మత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం పెందుర్తి మండలం వాలిమెరక గ్రామంలో పేదలందరికి ఇల్లు పథకం లో మహిళలకు మంజూరు చేసిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మహిళలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలో ప్రకటించిన పేదలందరికీ ఇల్లు భారీ సంక్షేమ కార్యక్రమం అని తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో మూడు పండుగలు జరుగుతున్నాయని, ముక్కోటి ఏకాదశి, క్రిస్టమస్, మహిళలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే పండగ అని మంత్రి వర్ణించారు.
సంక్షేమ పథకాలన్నీ మహిళలకే ఇస్తున్నామని, మహిళలకు గౌరవం ఇచ్చిన చోట దేవతలు నడయాడు తారని రాష్ట్రం సుభిక్షంగా ఉందని అని చెప్పారు. మహిళలపై ఎటువంటి అఘాయిత్యం జరిగిన ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వారికి తగిన న్యాయం చేస్తున్నారని చెప్పారు.
జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 2 లక్షల 96 వేల మందికి పట్టాలు మంజూరు అయ్యాయని, అందులో లక్ష 75000వేల జీ.వీ.ఎం.సీ పరిధిలో ఉన్నాయని తెలిపారు. 99 శాతం లబ్ధిదారులకు సొంత పంచాయతీలోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. భూమిని చదును చేసి ప్లాట్లు వేసి చక్కని వాతావరణంలో లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని దరఖాస్తు చేసుకున్నవారికి 90 రోజులలో మంజూరు చేస్తామని తెలిపారు.పెందుర్తి శాసనసభ్యులు ఏ అదీప్ రాజు మాట్లాడుతూ పెందుర్తి నియోజకవర్గంలో 7042 మందికి, మండలంలో 2395 మందికి ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయన్నారు. వాలిమెరక గ్రామంలో 327 మందికి పట్టాలు మంజూరు అయ్యాయని, ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం రూ.7 లక్షలు ఉందని చెప్పారు.
తరువాత మంత్రి మహిళలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. లబ్ధిదారులు మేరీ కుమారి, వాణి విశ్వనాథ్ మాట్లాడుతూ ఎన్నాళ్ల నుంచో ఉన్న తమ కలలు సాకారం అయ్యాయని ఎంతో సంతోషంగా ఉందని జగనన్న పేదల గుండెల్లో నిలిచి ఉంటారని చెప్పారు. అంతకు ముందు మంత్రి శ్రీనివాసరావు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎం.పీ బి.సత్యవతి జె.సి. ఎన్.వేణుగోపాల్ రెడ్డి, ఎస్.డి.సి సూర్యకళ, ఆర్డీవో పెంచల కిషోర్, తాసిల్దార్ రామారావు ఎం.పీ.డీ.వో. మంజుల వాణి తదితరులు పాల్గొన్నారు.