100% ఇంటి పట్టాలు పంపిణీ జరగాలి..
Ens Balu
2
Anantapur
2020-12-26 13:42:56
అనంతపురం జిల్లాలోని ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే 100 శాతం ఇంటి పట్టాలు పంపిణీ చేయాలని, లబ్ధిదారులకు ఎవరికి కేటాయించిన ఇంటి స్థలంలోనే వారిని నిలబెట్టి పట్టాలు ఖచ్చితంగా అందించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమం పై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, హౌసింగ్ పిడి, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డివో లు, తహసీల్దార్లు, హౌసింగ్ ఈ ఈ లు, డి ఈ లు, ఏ ఈ లు, విఆర్వో లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని చేపట్టిందని, ప్రతి ఒక్క స్థాయిలో అధికారులంతా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలన్నారు. ప్రతి ఒక్క లేఔట్ దగ్గరే ఇంటి పట్టాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని, ఖచ్చితంగా పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన రోజున లేఔట్ స్థలంలోనే ఎలాంటి ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు పట్టాలివ్వాలన్నారు. ఇంటి పట్టాల తో పాటు ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వాలని, ఇందుకు సంబంధించి ఎన్ని ఇంటి పట్టాలు ఇవ్వాల్సి ఉంది, ఎన్ని పటాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్ల నిర్మాణ ప్రొసీడింగ్స్ ఇచ్చారు అనేది వేర్వేరుగా ప్రతి లేఔట్ కు సంబంధించి 100 శాతం రిపోర్ట్ లు తమకు అందజేయాలని హౌసింగ్ పిడి, స్పెషలాఫీసర్ లను ఆదేశించారు. ప్రతిరోజు ఇంటి పట్టాల పంపిణీ పై సాయంత్రం 6 గంటల కల్లా రిపోర్టులు పంపించాలని, మండల స్థాయిలో తహసీల్దార్లు లేఔట్ ప్రకారం వివరాలు పంపించాలన్నారు.
ఇంటి పట్టాల పంపిణీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు మినిట్ టూ మినిట్ ముందుగానే సిద్ధం చేసుకుని క్రమ పద్ధతిలో కార్యక్రమంను నిర్వహించాలని, ఇందుకు సంబంధించి ఒక అధికారిని నియమించాలన్నారు. లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లలో ఎవరి స్థలంలో వారిని నిలబెట్టి పట్టాలు అందించాలని, దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు.
పట్టాలు ఇచ్చేందుకు ఎవరైనా డబ్బులు అడిగినా, మళ్ళీ ఇస్తామని చెప్పడం గానీ ఎక్కడైనా జరిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం :
పట్టాలు ఇచ్చేందుకు ఎవరైనా డబ్బులు అడిగినా, మళ్ళీ పట్టాలు ఇస్తామని చెప్పడం గానీ ఎక్కడైనా జరిగినట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. ఎలాంటి ఆలస్యం చేయకుండా ఇంటి పట్టాల కార్యక్రమం నిర్వహించిన రోజు ప్రతి ఒక్క లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడైతే ప్రొసీడింగ్స్ ఇస్తున్నారో అక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలన్నారు. ఇందుకు సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, గ్రామాల్లో వెల్ఫేర్ అసిస్టెంట్, మున్సిపాలిటీలలో కమ్యూనిటీ అసిస్టెంట్లు ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఎటువంటి సపోర్ట్ కావాలి అనేది లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలని, ప్రభుత్వం నుంచి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహకారాలు అందించాలని, ప్రతిచోట ఇళ్ల నిర్మాణం తక్షణం మొదలు పెట్టించాలని కలెక్టర్ ఆదేశించారు.
1902 టోల్ ఫ్రీ నెంబర్ పై లబ్ధిదారులకు అవగాహన వచ్చేలా ప్రచారం చేయాలి :
ప్రభుత్వం పేదలందరికీ ఇల్లు కింద ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే తెలియజేసేందుకు కోసం 1902 టోల్ ఫ్రీ నెంబర్ ను ఏర్పాటు చేసిందని, 1902 టోల్ ఫ్రీ నెంబర్ పై లబ్ధిదారులకు అవగాహన వచ్చేలా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ నుంచి ఏఈ, డిఈ, ఈఈ, హౌసింగ్ పిడి, డ్వామా పిడి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) వరకు కు హౌసింగ్ కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా ఎవరికి ఫిర్యాదు పంపించాలి, ఫిర్యాదు వచ్చాక ఎన్ని రోజులలో దానిని పరిష్కరించాలి, ఒకవేళ మీ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే ఆ ఫిర్యాదును ఎవరికి పంపించాలి, ఇందుకు సంబంధించి ఆ అధికారి సమస్యను ఎన్ని రోజులలో పరిష్కరించాలి అనేది ప్రతి ఒక్కరికి ప్రభుత్వం టైమ్లైన్ ఇచ్చిందని, రోజుల నుంచి 30 రోజుల్లోపు వచ్చిన ఫిర్యాదును పరిష్కరించాలన్నారు.
అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ కార్యక్రమాన్ని ఆయా మతాల సెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్క లేఔట్ లోనూ మూడు రకాల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అందులో ఇంటిగ్రేటెడ్ కాలనీలకు సంబంధించి ప్రతి ఒక్క లేఔట్ దగ్గర ఫ్లెక్సీ ఉండాలని, ప్రతి ఫ్లాటు లబ్ధిదారుల పేరు, ఫ్లాట్ నెంబర్, వివరాలతో సహా ఒక ఫ్లెక్సీ ఉండాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మోడల్ హౌస్ యొక్క ఫ్లెక్సీ ఉండాలని, 1902 టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించిన ఫ్లెక్సీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
జిల్లా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్ అభినందనలు :
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కింద శుక్రవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్, హౌసింగ్ పిడి, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డివో లు, తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, విఆర్వో లు, సర్వేయర్లను జిల్లా కలెక్టర్ అభినందించారు. క్షేత్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి యంత్రాంగ వరకు అందరూ బాగా పని చేశారని జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు నిర్వహించేది అనేది లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని, ఇంటి పట్టాలను ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.