ప్రైవేటు విద్యార్ధులకూ పథకం వర్తింపచేయాలి..


Ens Balu
3
2020-12-26 20:46:06

ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివితే జగనన్న వసతి, విద్యా దీవెన వర్తించబోవంటూ ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 77ను తక్షణమే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నగర కమిటీ ఆధ్వర్యాన విద్యార్థులు శనివారం ఉక్కునగరంలో ఆందోళనకు చేశారు. జిఒ ప్రతులను దగ్ధం చేస్తూ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు కె.ప్రభుదాస్‌, ఎల్‌జె.నాయుడు మాట్లాడుతూ, 2020 - 21 విద్యా సంవత్సరాల్లో ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న పీజీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల విద్యార్థులకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన వర్తించబోవంటూ ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు. తాజా జిఒ వల్ల రాష్ట్రంలో పేద ఎస్‌సి, ఎస్‌టి, బిసి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 - 19, 2019 - 20 విద్యా సంవత్సరాలకుగానూ పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో ఇప్పటికే విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారని తెలిపారు.  విద్యా సంక్షేమం కోసం పాదయాత్ర సమయంలో సిఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా ఉన్నవాటిని తెగ్గోయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 158 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కాలేజీల్లో విద్యార్థులు అడ్మిషన్‌ పొందారని, వీరి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వ పీజీ కాలేజీలు అతి తక్కువగా ఉండటంతో గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత విద్య ఇప్పటికే అందని ద్రాక్షలా మారిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన జిఒ 77 వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే దీన్ని రద్దు చేసి అర్హులందరికీ జగనన్న వసతి, విద్యా దీవెనను వర్తింపజేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్‌.చిన్నారి, నగర నాయకులు బి.కుసుమ, వై.అప్పలరాజు, కె.రాకేష్‌, ఎం.రాజశేఖర్‌, లావణ్య తదితరులు పాల్గొన్నారు.