రాష్ట్రంలో నిరుపేదల గూడు కష్టాలు తీరుతున్నాయి..
Ens Balu
3
East Godavari
2020-12-26 21:31:56
ఆంధ్రప్రదేశ్ లో పేదవారి కష్టాలను దృష్టిలో ఉంచుకొని, వారి రోజువారీ ఉపాధికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వమే పూర్తిగా ఇంటిని కట్టించి ఇచ్చే ఆప్షన్‌ను కూడా లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారని సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఏపీ హౌజింగ్ స్పెషల్ కమిషనర్ హరినారాయణ, జేసీ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తదితరులతో కలిసి కొమరగిరిలోని భారీ లేఅవుట్ ప్రాంతాన్ని ప్రవీణ్ ప్రకాశ్ సందర్శించారు. లబ్ధిదారులకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, ఆప్షన్ల గుర్తింపు కార్యక్రమాన్నిపర్యవేక్షించారు. అధికారులు లబ్ధిదారులకు లేఅవుట్‌లోని ప్లాట్లను చూపిస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఉన్నతాధికారులతో కలిసి ప్రవీణ్ ప్రకాశ్ కొంతమంది లబ్ధిదారులను స్వయంగా ప్లాట్ల వద్దకు తీసుకెళ్లి, వారితో ఫొటోలు దిగారు. లబ్ధిదారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. దాదాపు మూడు గంటల పాటు లేఅవుట్ ప్రాంతంలో పర్యటించారు. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులు ఇచ్చిన ఆప్షన్లను అడిగి తెలుసుకున్నారు. తమ ప్లాట్లను గుర్తించడంలో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని సర్వేయర్లకు సూచించారు. ప్లాట్లను తేలిగ్గా గుర్తించేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రవీణ్ ప్రకాశ్ అధికారులకు సూచించారు. గతంలో ఎప్పడూ లేని విధంగా గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో అమలవుతోందని, పేదలకు సొంతింటి కల సాకారమవుతోందని ప్రవీణ్ ప్రకాశ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రవీణ్ ప్రకాశ్ వెంట జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ తదితరులు ఉన్నారు.