ఇంటి నిర్మాణం విషయంలో లబ్దిదారుదే తుది నిర్ణయం..
Ens Balu
3
Komaragiri
2020-12-26 21:40:29
జిల్లాలో నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద పేదలకు ఇంటి స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగుతోందని, ఈ ప్రక్రియ కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తదితరులతో కలిసి యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలోని లేఅవుట్ ప్రాంతాన్నికలెక్టర్ సందర్శించారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి అధికారులు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులకు ఇంటి పట్టాల పంపిణీకి మొత్తం 46 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు వివరించారు. ఈ మొత్తం కార్యక్రమంలో వార్డు అమెనిటీస్, సంక్షేమ, ప్లానింగ్ కార్యదర్శులతో పాటు గ్రామ సర్వేయర్లు కూడా భాగస్వాములవుతున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు ప్లాట్లను చూపించి, అక్కడ ఫొటోలు తీసేందుకు 50 మంది సర్వేయర్ల బృందాన్నిఅందుబాటులో ఉంచామన్నారు. లేఅవుట్లలో ఇళ్లనిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అందుబాటులో ఉంచిన మూడు ఆప్షన్లపై లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని, వారి నిర్ణయమే అంతిమమని పేర్కొన్నారు. లేఅవుట్‌లోని మోడల్ హౌజ్‌ను లబ్ధిదారులకు చూపించి, అదే విధంగా ఇళ్ల నిర్మాణం జరుగుతుందనే దానిపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంట రంపచోడవరం ఐటీడీఏ పీవో సీవీ ప్రవీణ్ ఆదిత్య, కాకినాడ ఆర్‌డీవో ఏజీ చిన్నికృష్ణ తదితరులు ఉన్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్ నవీన్‌కుమార్ కూడా శనివారం కొమరగిరిలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.