అర్హులైన ప్రతీఒక్కరికీ ప్రభత్వ సొంతిల్లు..


Ens Balu
4
Visakhapatnam
2020-12-27 21:21:49

జివిఎంసి పరిధిలో గల ఉత్తర నియోజక వర్గంలోగల అర్హులైన పేద లబ్దిదారులకు ప్రభుత్వం నవరత్నాల పధకాలలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండ్ల పట్టాల పంపిణీ చేపడుతున్నామని  రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. ఆదివారం జిల్లా కలక్టరు వి. వినయచంద్, జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనలతో కలిసి ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసారు. పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా  రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి పలు సంక్షేమ కార్యక్రమాల ఫలాలను రాష్ట్రంలోని అర్హులైన అందరికి నవరత్నాల పధకం క్రింద నిరంతరం అందించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని, ఎన్నికల మేనిఫెస్టో ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్ వలే నమ్మి పలు సంక్షేమ  పనులు చేపదుతున్నామని తెలిపారు. అందులో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రివర్యులు డిశంబర్ 25 తేదిన తూర్పు గోదావరి జిల్లాలో ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంబించగా, ఈ రోజు నగరంలోని ఉత్తర నియోజక పరిధిలో టిడ్కో పధకంలో ఇండ్లు, అర్హులైన లబ్ది దారులకు ఇండ్ల స్థలాల మంజూరు లేఖను, బి.ఎల్.సి. లబ్దిదారులకు  పొజిషన్ ధ్రువపత్రాలను మంజూరు చేపట్టామన్నారు. సాంకేతిక సమస్యలు తొలగిన వెంటనే ఇండ్ల స్థలాలు లబ్దిదారులకు అప్పజెప్పి, కాలనీలు ఏర్పాటు చేసి, రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి మౌళిక సదుపాయాలు కల్పిస్తామని  సభాముఖంగా తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖామాత్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చేపట్టిన సుధీర్ఘ పాదయాత్రలో తెలుసుకున్న ప్రజల అవసరాలను తీర్చడానికి పలు కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేపడుతున్నారని, రాష్ట్రంలో అర్హులైన వారందరికీ ముఖ్యంగా మహిళలకు సామాజిక ఆర్ధికంగా ఎదుగుదలకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం నిరంతరం చేపడుతున్నదని చెపారు. ఎంతో  పారదర్శకంగా ఇండ్ల పంపిణీ పధకాన్ని కూడా రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నదని, అవినీతికి తావులేకుండా గృహాలను, ఇండ్ల స్థలాలను మహిళల పేరుతోనే పంపిణీ చేయబడుతుందని తెలిపారు.    జిల్లా కలక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదలందరికీ ఇళ్ళు మంజూరు చేసే సంకల్పంతో నవరత్నాల పధకంలో భాగంగా క్రిస్మస్/ వైకుంఠ ఎకాదశి నాడు 31 లక్షల మందికి పట్టాల పంపిణీ కార్యక్రమంనకు శ్రీకారం చుట్టారు. సచివాలయాలు ద్వారా అర్హులైన లబ్దిదారుల నుండి దరఖాస్తులను స్వీకరించి ఎంతో పారదర్శకతతో పరిశీలించి అర్హులైన వారందరికీ ఈ కార్యక్రమంలో పట్టాల పంపిణీ జరుగుచున్నదని తెలిపారు. ఈ కార్యక్రమం సుమారు 12 రోజులు వరకు కొనసాగిస్తామని ఇది నిరంతర ప్రక్రియని, ఎవ్వరైనా అర్హులు ఉండి దరఖాస్తు చేయనివారు కూడా ప్రస్తుతం వార్డు సచివాలయాలలో ఇండ్ల స్థలం కొరకు దరఖాస్తు తీసుకోవచ్చని సూచించారు. నగర పరిధిలో ఉన్న లబ్దిదారులకు, పట్టణ సివారు ప్రాంతాలైన ఆనందపురం. సబ్బవరం, పెందుర్తి వంటి మండలాలకు చెందిన గ్రామాలలో ఖరీదైన భూ స్థలాలను ప్రభుత్వం కేటాయిస్తున్నాదని చెప్పారు. ప్రైవేట్ లే-అవుట్లకు తలదన్నే విధంగా లే-అవుట్లను ఏర్పాటుచేసి కాలనీలు నిర్మిస్తామన్నారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన మాట్లాడుతూ, నగరపరిధిలో సుమారు 2 లక్షల పై చిలుక లబ్దిదారులకు ఇండ్ల లేని కొరత తీర్చే యజ్ఞంలో తనను భాగస్వామ్యం చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులుకు నగర ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించినట్లు మూడు ఆప్షన్లలో,                    లబ్దిదారులు సూచించిన ఒక ఆప్షన్ ప్రకారంగా ఇళ్ళు నిర్మించి ఇస్తామన్నారు. ఈ పధకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఎవరైనా అర్హులైన లబ్దిదారులు ఉంటే, వార్డు సచివాలయంలో ఇండ్ల స్థలాల కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారు. ఇంకను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పంపిన సందేశాన్ని సభకు చదివి వినిపించారు. ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె.రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన పాదయాత్రలో చెప్పిన విధంగా సామాజిక న్యాయానికి, విద్య, ఆర్ధికాభివృద్ధికి, మహిళా సాధికారతకు పాటు పడుతున్నారని, మరీ ముఖ్యంగా వాలంటరీ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ముంగిట్లో ప్రభుత్వ సేవలు అందిస్తున్నదుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నవరత్నాలలో భాగంగా ఉత్తర నియోజిక వర్గంలో 4219 మందికి టిడ్కో ఇళ్ళు 370 కోట్ల వ్యయంతో, 27603 మంది లబ్దిదారులకు రూ. 496 కోట్లుతో ఇండ్ల నివేశన స్థలాలు ఏర్పాటు, 5కోట్లతో 394బిఎల్.సి. పధకంలో ఇండ్ల ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు.  చివరగా రాష్ట్ర మంత్రులు చేతుల మీదుగా ఉత్తర నియోజక వర్గం పరిధిలోని లబ్ధిదారులైన కట్టా జయలక్ష్మి, ఫాతిమా సుల్తాన్ బేగం, అప్పయ్యమ్మ లకు టిడ్కో గృహాల మంజూరు పత్రాలను, ఆవాల  లక్ష్మికి ఇండ్ల నివేశన స్థల హామీ లేఖను అందజేశారు. ఈ కార్యక్రమంలో జివిఎంసి  యు.సి.డి. ప్రాజెక్టు డైరెక్టరు వై. శ్రీనివాసరావు, విశాఖ ఆర్.డి.ఓ కె.పి.కిషోర్, నాల్గవ జోనల్ కమిషనర్ సింహాచలం, రెండవ జోనల్ కమిషనర్ శ్రీనివాసరావు,  నాల్గవ జోన్ కార్యనిర్వాహక ఇంజినీరు, పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది, టిడ్కో అధికారులు, వివిధ కార్పోరేషన్ డైరెక్టర్లు, వార్డు సచివాలయాల కార్యదర్శులు, వాలంటీర్లు, సి.ఓ. లు, ఆర్.పి.లు, మాజీ కార్పొరేటర్లు, వార్డు స్థాయి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.