'అనంతతో పెరిగిన భూగర్భ జల నీటి మట్టం' ..
Ens Balu
3
Anantapur
2020-12-27 21:24:33
అనంతపురం జిల్లాలో భూగర్భ జల నీటి మట్టం గణనీయంగా పెరిగిందని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది తుఫానుల ప్రభావం వల్ల కురిసిన వర్షాల కారణంగా భూగర్భ జలాలు పదేళ్ల కిందటి స్థాయిలకు చేరుకున్నాయన్నారు. 2020లో సగటు భూగర్భ జల మట్టం 12.29 మీటర్లు కాగా గత పదేళ్లలో ఎప్పుడూ ఇంతపైకి నీటి మట్టం చేరలేదన్నారు. కేవలం 2010లో మాత్రమే భూగర్భం జలం ప్రస్తుత స్థాయి కంటే పైన 9.71 మీటర్లుగా నమోదైందన్నారు. ఈ ఏడాది మే నెలతో పోలిస్తే నవంబరు నాటికి సగటున 10.77 మీటర్ల పైకి భూగర్భం జలం చేసుకుందన్నారు. 2019 మే నాటితో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ జల మట్టం 13.67 మీటర్లపైకి చేరుకుందన్నారు. వర్షాల వల్ల జిల్లాలో 52 శాతం అధికంగా వర్షపాతం నమోదైందన్నారు. జిల్లాలో సగటు వర్షపాతం 491.50 మిల్లీమీటర్లు ఉండగా ఈ ఏడాది 747.30 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. మొత్తంగా జిల్లాలో 504.80 టీఎంసీల వర్షపు నీరు కురియగా... జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా అందులో 60.58 టీఎంసీల నీరు భూగర్భ జలంగా మారిందన్నారు.
తాడిపత్రి మండలంలోని అవులతిప్పాయ పల్లి గ్రామంలో కేవలం పది సెంటీ మీటర్ల లోతులోనే నీరు లభిస్తోండటం కరువు జిల్లాగా పేరు తెచ్చుకున్న అనంతపురం జిల్లా సస్యశ్యామలంగా మారే దిశగా సాగుతోందని చెప్పేందుకు చిన్న ఉదాహరణ మాత్రమేనన్నారు.
గత ఏడాది మూడు మీటర్ల లోపే నీరు లభించే మండలం జిల్లావ్యాప్తంగా ఒక్కటి కూడా లేదనీ.. ప్రస్తుతం ఐదు మండలాల్లో మూడు మీటర్లలోపే నీరు లభిస్తోందన్నారు. 3 నుంచీ 8 మీటర్లలోపు నీరు లభించే మండలాల సంఖ్య 15 నుంచి 22కు పెరిగిందన్నారు. 8 నుంచి 15 మీటర్లలోపు 16 మండలాలు, 15 నుంచి 30 మీటర్ల లోపు 17 మండలాలు, 30 మీటర్ల కన్నా లోతులో నీరు లభించే మండలాలు 3 ఉన్నాయన్నారు.
విస్తారంగా వర్షాలు కురవడం..అలాగే హెచ్చెల్సీ, హంద్రీనీవాల ద్వారా నీటి విడుదల కొనసాగడంతో భూగర్భజల పరిస్థితి బాగా మెరుగైందనీ.. రానున్న ఎండాకాలంలో తాగునీటికి, సాగునీటికీ ఇబ్బంది ఉండదని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.