గ్రీన్ జోన్ లోకి వెళ్లిన విజయనగరం..
Ens Balu
3
Vizianagaram
2020-12-27 21:31:33
విజయనగరం జిల్లా నేటితో కోవిడ్ లేని జిల్లాగా మారి గ్రీన్ జోన్ లోకి వెళ్లిందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. డిసెంబరు 1వ నుండి 26వ తేదీ వరకు జిల్లాలో 74 వేల 41 పరీక్షలు నిర్వహించగా 310 మందికి కోవిడ్ పోజిటివ్ నిర్థారణ అయిందని, మూడు మరణాలు సంభవించాయని తెలిపారు. గత వారం రోజులుగా పోల్చిచూస్తే 20వ తేదీన 4 కేసులు నమోదు కాగా 21న తేదీన 8, 22,23 తేదీలలో 4, 24వ తేదీన 6 కేసులు 25వ తేదీన 4 కేసులు నమోదు కాగా 26వ తేదీన ఒక్క కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. జిల్లాలో క్రమేనా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం సంతోషంగా వుందని అన్నారు. కోవిడ్ రెండవ దశ విస్తరించకుండా వుండేందుకు 50 రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని, వివిధ శాఖల ద్వారా అవగాహనా ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతోందని, ఈ కారణంగానే కోవిడ్ కేసుల సంఖ్య క్రమేణా తగ్గుముఖం పట్టిందన్నారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వుండి జిల్లాను గ్రీన్ జోన్ లో కొనసాగించేందుకు సహకరించాలని ఆ ప్రకటనలో కోరారు. జిల్లా గ్రీన్ జోన్ గా మారినందున ఆదివారం పలువులు అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు కలెక్టర్ అభినందనలు తెలిపారు.