సీఎం సభాస్థలికి వచ్చేవారందరికీ కరోనా పరీక్షలు..
Ens Balu
2
Vizianagaram
2020-12-27 21:35:34
పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గుంకలాంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే సభకు హాజరయ్యే వారికి తనిఖీల కోసం కోవిడ్ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ చెప్పారు. సభా ప్రాంగణంలోకి వచ్చే వారికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు, శానిటైజేషన్, ముఖానికి మాస్కు ధరించేలా చర్యలు చేపడతామన్నారు. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.జి.నాగభూషణరావు, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.రమణకుమారి లను ఆదేశించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరినీ వారికి కేటాయించిన బ్లాకులోకి పంపినపుడే స్కానింగ్ చేసి, శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకొని, మాస్కు ధరించేలా జాగ్రత్తలు పాటించేందుకు వీలుగా తగినన్ని స్కానర్లు, శానిటైజర్లు అన్ని బ్లాకుల్లో సిద్ధంగా వుంచాలని కలెక్టర్ సూచించారు. సభకు హాజరయ్యే వారందరికీ తాము మాస్కులు అందజేస్తున్నామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి చెప్పారు. ముఖ్యమంత్రి ఏర్పాట్లపై స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామితో కలసి జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధికారులకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అప్పగించిన బాధ్యతలు, సి.ఎం.సభకు ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయనే అంశంపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా డి.సి.హెచ్.ఎస్. డా.నాగభూషణ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు హాజరయ్యే ప్రజానీకం, ప్రముఖులు, ఇతర అత్యవసర వైద్య సదుపాయాలు కల్పించేందుకు మూడు ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేదిక వద్ద 104, 108 వాహనాలతో పాటు ఒక వైద్య బృందం ఏర్పాటు చేస్తున్నామని, కాన్వాయ్ లో ఒక బృందం, ప్రముఖులు విడిది చేసే జిల్లాపరిషత్ అతిథిగృహంలో ఒక బృందాన్ని అందుబాటులో ఉంచనున్నట్టు వివరించారు. ఎండ ప్రభావంతో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించేలా అవసరమైన ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు, డీహైడ్రేషన్ మందులతో వైద్య బృందాలు ఒక శిబిరం ఏర్పాటు చేసి సిద్ధంగా వుండాలని కలెక్టర్ ఆదేశించారు.
సభకు హాజరయ్యే వారికి బస్సుల ఏర్పాటులో పార్కింగ్ సమస్యలను దృష్టిలో వుంచుకొని కేవలం 200 బస్సులు, మరో వంద వరకు మ్యాక్సీ కాబ్‌లకు మాత్రమే అవకాశం వుంటుందని ఆ మేరకు బస్సులను అనుమతిస్తామని డి.ఐ.జి. వి.కాళిదాస్ రంగారావు చెప్పారు. ఇందుకు తగ్గట్టే బస్సులను తగ్గిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హెలిపాడ్ నుండి సభా వేదిక వరకు డబుల్ బ్యారికేడింగ్ చేయాలని డి.ఐ.జి. రోడ్లు భవనాల శాఖ అధికారులను కోరారు. బస్సులన్నీ ఒకే సమయంలో కాకుండా వేర్వేరు సమయాల్లో బయలుదేరేలా జాగ్రత్తలు వహించాలని కోరారు.
జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ మాట్లాడుతూ వేదిక ప్రాంగణంలో లబ్దిదారులు బ్లాకులుగా కూర్చొనే ఏర్పాట్లు చేయడం జరిగిందని, లబ్దిదారులకు ఏ బ్లాకులో ప్లాటు కేటాయిస్తే వేదిక వద్ద అదే బ్లాకుకు సంబంధించి తమకు కేటాయించిన సీట్లలో కూర్చొనేలా ఇన్ చార్జి అధికారులంతా ముందురోజే తగిన ప్రాక్టీసు చేయాలన్నారు. ఇన్ చార్జి అధికారులు అన్ని బ్లాకుల వద్ద తగినంత తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నగరం నుండి లబ్దిదారులు గుంకలాం సభావేదిక వద్దకు చేరుకునేందుకు చేస్తున్న ఏర్పాట్లపై మునిసిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, రవాణాశాఖ ఉప కమిషనర్ శ్రీదేవి, ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ అప్పలరాజు తదితరులు వివరించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.జి.సి. కిషోర్ కుమార్ సభా ప్రాంగణం ప్లాన్‌ను, లే అవుట్‌ను మ్యాప్ ద్వారా అధికారులకు వివరించారు. ఎస్.ఇ.బి. అదనపు ఎస్.పి. శ్రీదేవి రావు, డి.ఎస్.పి. అనిల్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్(ఆసరా) జె.వెంకటరావు, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.