రూపాయికే విశాఖ నగరంలో పేదలకు ఇల్లు..


Ens Balu
4
Visakhapatnam
2020-12-27 21:48:33

విశాఖపట్నం లాంటి మహానగరంలో పేద మహిళలకు ఒక్క రూపాయికే ఇల్లు మంజూరు చేసిన ఘనత ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమవుతుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని కైలాసపురం లో గల డి.ఎల్. బి.  మైదానంలో నిర్వహించిన  పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ పేదలకు ఇచ్చే జగనన్న కాలనీలలో అన్ని మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. నగరంలో ఉన్న 2లక్షల 7 వేల కుటుంబాలకు నగరం చుట్టుపక్కల 62 ప్రాంతాలలో కాలనీలను నిర్మించనున్నట్లు చెప్పారు.  3,800 ఎకరాల స్థలం లో రూ. 90 కోట్లతో ఇళ్ళు  నిర్మించి ఇస్తామని చెప్పారు. రూ. లక్ష 80వేల ఖర్చుతో ఇళ్ల నిర్మాణం చేపడతారని తెలిపారు.  ముఖ్యమంత్రి పాదయాత్రలో ప్రజలకు ఏమి చెప్పారో  అదే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూఉత్తర  నియోజక వర్గంలో 27 వేల మందికి పట్టాలు ఇస్తున్నట్లు, 4,120 టిడ్కో ఇళ్లను కూడా మంజూరు చేసినట్లు చెప్పారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియట్ లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని అన్నారు. బొత్స సత్యనారాయణ గారి సహకారంతో త్వరలోనే విశాఖకు గోదావరి జలాలు వస్తాయని నగరం లో 24 గంటలు తాగునీరు అందుబాటులో ఉంటుందని తెలిపారు. జిల్లా కలెక్టరు వి. వినయ్ చంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ప్రకటించిన నవరత్నాలు లో భాగంగా పేదలందరికీ ఇల్లు పథకాన్ని క్రిస్టమస్ రోజున ముఖ్యమంత్రి తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారని చెప్పారు. ఈ కార్యక్రమాలను 12 రోజులు జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. బడుగు బలహీన, పేద గృహిణుల పేరుమీద ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని, నగరంలో లబ్ధిదారులకు ఇచ్చే స్థలం రూ.5 నుండి 7 లక్షల ఖరీదు చేస్తోందన్నారు. జిల్లాలో గల లబ్ధిదారుల్లో ఎక్కువమంది విశాఖ నగరం లోనే ఉన్నారని జిల్లాలో  2 లక్షల 93 వేల కుటుంబాలకు  పట్టాలు ఇస్తామని, 24,192 టిడ్కో ఇళ్లను అందజేస్తున్నట్లు చెప్పారు. విశాఖ నగర పాలక సంస్థ కమిషనర్ జి.సృజన మాట్లాడుతూ సాంకేతిక కారణాల మూలంగా ప్రస్తుతం స్థలాన్ని చూపింఛలేక పోతున్నామని, కానీ లబ్ధిదారులకు ఇంటి స్థలాన్ని మంజూరు చేసినట్లుగా  ఇంటిపట్టా ఇస్తున్నందున వారు నిశ్చింతగా ఉండొచ్చు అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం మూడు ఆప్షన్ లను ఇచ్చారన్నారు.  ఇంటి నిర్మాణానికి మంజూరైన సొమ్ముతో  లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవడం , నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం అందజేసి నిర్మాణానికి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులకు ఇవ్వడం, ప్రభుత్వమే పూర్తిగా ఇంటిని కట్టి ఇవ్వడం అనే మూడు మార్గాల ద్వారా ఇంటి నిర్మాణం జరుపుకోవచ్చు అని తెలిపారు.