యువత నైపుణ్యాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ..
Ens Balu
5
Kakinada
2020-12-28 18:01:12
తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 (పీఎంకేవీవై 3.0)ను పటిష్టంగా అమలుచేసేందుకు కృషిచేస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక అమలుపై కలెక్టర్ అధ్యక్షతన జిల్లా నైపుణ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొన్ని రంగాలకే పరిమితం కాకుండా.. జిల్లాలోని వనరుల స్థితిగతులను విశ్లేషించి, యువతలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. వివిధ విభాగాల సమన్వయంతో ఉమ్మడి వేదిక ఆధారంగా ఇకపై యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దీనికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేయాలని సూచించారు. యువతకు మెరుగైన జీవనోపాధిని కల్పించేందుకు ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ కార్యక్రమాల నిర్వహణ ముఖ్యమని పేర్కొన్నారు. రిటైల్, ఆటోమోటివ్ వంటి రంగాలకే పరిమితం కాకుండా ఉపాధి అవకాశాలు లభించే రంగాలకు సంబంధించి కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ మేరకు శిక్షణ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు. పారిశ్రామిక శిక్షణ కేంద్రాలు (ఐటీఐ), ఒకేషనల్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులకు సుస్థిర ఉపాధికి అవసరమైన అదనపు నైపుణ్యాలను గుర్తించి, శిక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలన్నారు. జిల్లాలో 38 ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ (ఈఎస్‌సీ), ఆరు యూత్ ట్రయినింగ్ సెంటర్స్ (వైటీసీ) తదితరాల ద్వారా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. నైపుణ్య శిక్షణ ఇవ్వడమే కాకుండా యువతకు ప్లేస్‌మెంట్స్ లభించేలా చూస్తున్నట్లు పేర్కొన్నారు.
సమన్వయం ముఖ్యం: జేసీ (సంక్షేమం) జి.రాజకుమారి
మంచి ఉపాధి అవకాశాలు లభించేలా బ్యాచ్‌ల వారీగా యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, ఆపై సర్టిఫికెట్లు అందించి.. ప్లేస్‌మెంట్ లభించేలా చూడటం.. ఈ మొత్తం ప్రక్రియలో వివిధ శాఖల అధికారుల సమన్వయం ముఖ్యమని జిల్లా జాయింట్ కలెక్టర్ (ఆసరా, సంక్షేమం), జిల్లా నైపుణ్య కమిటీ నోడల్ అధికారి జి.రాజకుమారి పేర్కొన్నారు. 2021, జనవరి నుంచి మార్చి వరకు వివిధ విభాగాల కార్యాచరణను జేసీ సమావేశం ముందుంచారు. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాభివృద్ధికి అత్యుత్తమ శిక్షణ భాగస్వాములను గుర్తించడం ప్రధానమని, దీనిపై దృష్టిసారించినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామ, పట్టణాల స్థాయిలో పటిష్టమైన వలంటీర్ వ్యవస్థ అందుబాటులో ఉందని, ఈ వ్యవస్థ సహాయంతో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలపై యువతకు అవగాహన కల్పించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ, జిల్లా నైపుణ్య కమిటీ కన్వీనర్ వై.హరిహరనాథ్ తెలిపారు. సమావేశంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు, వికాస పీడీ కె.లచ్చారావు, ఎల్‌డీఎం జె.షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.