ఉత్తరాంధ్రా నేతలందరూ ద్రోణరాజుని గుర్తుపెట్టుకోవాలి..
Ens Balu
3
Visakhapatnam
2020-12-28 18:51:18
ఉత్తరాంధ్రలో ఈ రోజు పదవులనుభవిస్తున్న అనేకమంది నేతలు ఉత్తరాంధ్ర టైగర్ ద్రోణంరాజు సత్యనారాయణ తయారు చేసినవారేనని వైఎస్సార్సీపీ నేత ,మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ అన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ వర్ధంతి సందర్భంగా సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ద్రోణం చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెసు నేతగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకొని ప్రజా హృదయాలను గెలుచుకున్నారని కొనియాడారు. ద్రోణం రాజకీయ వారసుడు శ్రీవాస్తవ కు పార్టీలో మంచి గుర్తింపునివ్వాలని, ద్రోణం కుటుంబానికి అన్నివిధాలా సహకరించాలని పార్టీ అధినాయకత్వాన్ని కోరారు. ప్రతీ ఏటా తన శక్తికొలది ద్రోణం పేరుమీదుగా సేవ కార్యక్రమాలు చేస్తానని ప్రకటించారు. ముఖ్య అతిధిగా హాజరైన శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ, రాజకీయాల్లో మచ్చలేని నాయకుడని,ఎంతోమందికి రాజకీయాల్లో ఓనమాలు నేర్పరన్నారు. మాజీ శాసనసభ్యుడు మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ, ఉన్నతవిలువలు కలిగిన రాజకీయ నేత ద్రోణంరాజని కొనియాడారు.మాజీ శాసనసభ్యుడు తిప్పల గురుమూర్తిరెడ్డి మాట్లాడుతూ తనకు ద్రోణంరాజు తనకు గురుతుల్యులని ప్రజాసేవలో ఎక్కడ రాజీ పడవద్దని హితబోధ చేసేవారని గుర్తుచేసుకున్నారు.మాజీ శాసన సభ్యుడు పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి నేతలవరకు అందరి అభిమానాన్ని సంపాదించుకున్న ఏకైక నాయకుడని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ కుమార్ మాట్లాడుతూ, ఉత్తరాంధ్రలో రాజకీయనాయకులను తయారుచేసే యూనివర్సిటీ గా గుర్తింపుపొందారన్నారు.వుడా మాజీ చైర్మన్ రవి మాట్లాడుతూ ఎన్ఠీఆర్ ను ఎదుర్కొని అధిష్టానం ప్రశంసలందుకొన్న ధీరుడన్నారు.బెహెరా భాస్కర రావు మాట్లాడుతూ ద్రోణం మచ్చలేని రాజకీయనాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అని,అనేకమంది నాయకులు,కార్యకర్తలను తయారుచేసిన దిగ్గజంగా పేరొందారన్నారు.ద్రోణంరాజు శ్రీవాత్సవ మాట్లాడుతూ, రాజకీయాల్లో ఏనాడూ పదవులనాశించకుండా పనిచేసిన మహా మనిషి అని,తాతగారికి,తండ్రికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా రాజకీయాల్లో రాణించాలన్నదే తన అభిమతమని తెలిపారు.తమ కుటుంబానికి ప్రజల్లో ఉన్న పేరు ప్రఖ్యాతులు తాతగారి వల్లేనన్నారు.అనంతరం ముఖ్య అతిధుల చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేసారు.దాదాపు వెయ్యిమందికి అన్న సంతర్పణ చేసి ద్రోణం పై తనకున్న అభిమానాన్ని దాడి సత్యనారాయణ చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జగ్గుపల్లి అప్పల రాజు, హేమలత,వైసీపీ నాయకులు రవి రెడ్డి,పీలా వెంకట లక్ష్మి అధిక సంఖ్యలో కార్యకర్తలు,అభిమానులు పాల్గొని ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన సేవలను స్మరించుకుని నివాళులర్పించారు.