1.8లక్షల మందికి పట్టాలు పంపిణీ..
Ens Balu
2
Vizianagaram
2020-12-28 19:03:00
నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ చెప్పారు. దీనిలో భాగంగా జిల్లాలో లక్షా, 08వేల, 230 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం నియోజకవర్గంలో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈనెల 30న జిల్లాకు వస్తున్నారని చెప్పారు. కలెక్టరేట్ సమావేశమందిరంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ వివరించారు. జిల్లాలో మొత్తం లక్షా, 08వేల, 230 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీని ఈనెల 25న ప్రారంభించామని, జనవరి 7వ తేదీ వరకు జరుగుతుందని చెప్పారు. నవరత్నాల్లో భాగమైన పేదలందరికీ ఇళ్లు కార్యక్రమానికి దరఖాస్తు చేసుకున్న 71,249 మందికి, అలాగే 90 రోజుల కార్యక్రమం క్రింద సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 3,659 మందికి, మొత్తం 74,908 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశామని తెలిపారు. అదేవిధంగా 8,048 మందికి టిట్కో ఇళ్లు, గ్రామకంఠాలు తదితర చోట్ల నివాసం ఉంటున్న 25,261 మందికి, ఆక్రమిత స్థలాల్లో ఉన్న 13 మందికి పొజిషన్ పట్టాలను మంజూరు చేసినట్లు వివరించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1164 లేఅవుట్లను రూపొందించామన్నారు. భూసేకరణకు సుమారు రూ.228కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. తొలిదశ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.1769 కోట్లు ఖర్చు చేస్తున్నామని, 18 నెలల్లో వీటిని పూర్తి చేస్తామని తెలిపారు. లబ్దిదారుల్లో 10355 మంది ఎస్సీలు, 7660 మంది ఎస్‌టిలు, 73,970 మంది బిసిలు, 6300 మంది ఓసిలు ఉన్నారని చెప్పారు. టిట్కో లబ్దిదారుల్లో 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్దదారులు 5568 మంది, 365 చదరపు అడుగుల లబ్దిదారులు 643 మంది, 430 అడుగుల లబ్దిదారులు 1840 మంది ఉన్నారని కలెక్టర్ తెలిపారు.
విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం, కొండకరకాం, జమ్మునారాయణపురం, సారిక వద్ద మొత్తం 554.82 ఎకరాల భూమిని సేకరించి, సుమారు రూ.5.75 కోట్ల ఖర్చుతో నాలుగు లేఅవుట్లను రూపొందించామని, మొత్తం 21,945 మందికి పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. వీరిలో నవరత్నాలు పథకం క్రింద 19,662 మంది, సచివాలయాల్లో దరఖాస్తు చేసుకున్న 2,283 మంది, టిట్కో లబ్దిదారులు 3,776 మంది ఉన్నారని చెప్పారు. టిట్కో లబ్దిదారుల్లో 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్దిదారులు 2016 మంది, 365 చదరపు అడుగుల లబ్దిదారులు 448 మంది, 430 అడుగుల లబ్దిదారులు 1312 మంది ఉన్నారని చెప్పారు.
గుంకలాం లేఅవుట్‌లో 12,301 మందికి ఈనెల 30న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి పట్టాలను పంపిణీ చేసి, పేదల సొంతింటి కలను నిజం చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆరోజు ఉదయం 11.10 గంటలకు జిల్లాకు వచ్చి, సుమారు 1 గంట వరకు ఉంటారని, ముందుగా పైలాన్‌ను ఆవిష్కరించిన అనంతరం, పట్టాలను పంపిణీ చేసి, లబ్దిదారులతో ముఖాముఖిలో పాల్గొంటారని చెప్పారు. సుమారు 397.36 ఎకరాల విస్తీర్ణంలోని ఈ లేఅవుట్‌ను 6 బ్లాకులుగా, రూ.4,36,73,186 ఖర్చుతో అభివృద్ది చేశామన్నారు. దీనిలో 102.50 ఎకరాల ప్రభుత్వ భూమి కాగా, 428 మంది రైతులనుంచి రూ.1,01,72,67000 ను పరిహారం చెల్లించి 294.86 ఎకరాల అసైన్డ్ భూమిని సేకరించడం జరిగిందని తెలిపారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు, వసతులతో ఈ లేఅవుట్‌ను అభివృద్ది చేయడం జరుగుతుందన్నారు.
పట్టాల పంపిణీ నిరంతర కార్యక్రమంగా కొనసాగుతుందని, అర్హులు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే, 90 రోజుల్లో ఇళ్ల స్థలాన్ని మంజూరు చేస్తామని కలెక్టర్ అన్నారు. అవసరమైతే భూమిని సేకరించి ఇస్తామని, పేదలు అందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. పట్టాల పంపిణీలో గానీ, లబ్దిదారుల ఎంపికలో గానీ ఎటువంటి అవకతవకలకు తావులేదని, అటువంటివి తమ దృష్టికి వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. లబ్దిదారుల జాబితాను ప్రతీ సచివాలయంలో ప్రదర్శనకు ఉంచామని చెప్పారు. జిల్లాలో పట్టాల పంపిణీకి లేఅవుట్లను సిద్దం చేసిన రెవెన్యూ యంత్రాంగాన్ని, సర్వే శాఖను, పంచాయితీరాజ్, డ్వామా తదితర ప్రభుత్వ శాఖలను ఈ సందర్భంగా కలెక్టర్ మనఃస్ఫూర్తిగా అభినందించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పట్టాలపంపిణీకి లబ్దిదారులు తరలిరావాలని కోరారు. దీనికోసం ప్రభుత్వపరంగా వాహన సదుపాయం కూడా కల్పిస్తున్నామని చెప్పారు. వచ్చే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా మాస్కును ధరించాలని కలెక్టర్ కోరారు. మీడియా సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డాక్టర్ జి.సి.కిశోర్ కుమార్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, సమాచార, పౌర సంబంధాల శాఖ ఎడి డి.రమేష్, ఎఫ్.సెక్షన్ సూపరింటిండెంట్ టి.గోవింద తదితరులు పాల్గొన్నారు.