457 మందికే తొలివిడత అక్రిడిటేషన్లు మంజూరు..


Ens Balu
3
Kakinada
2020-12-28 21:10:56

తూర్పుగోదావరి జిల్లాలో తొలివిడతగా వివిధ మీడియా సంస్థలకు చెందిన అర్హులైన 457 మంది జర్నలిస్ట్ లకు 2021-2022 ద్వైవార్షిక కాలానికి మీడియా అక్రిడిటేషన్లు జారీ చేశామని జిల్లా కలెక్టర్  డి.మురళీధరరెడ్డి తెలియజేశారు.   రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నూతనంగా ఏర్పాటైన  తూర్పు గోదావరి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తొలి సమావేశం సోమవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాలులో జిల్లా కలెక్టర్ మురళీధరరెడ్డి అధ్యక్షతన జరిగింది.  సమావేశంలో జిల్లాలో వివిధ మీడియా సంస్థలు, వాటి ప్రతినిధుల నుండి మీడియా అక్రిడిటేషన్ కోరుతూ ఆన్ లైన్ ద్వారా అందిన 2,271 ధరఖాస్తులను కమిటీ పరిశీలించి, జి.ఓ.142, తేది.20.11.2019 లో జారీ అయిన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు-2019లో నిర్థేశించిన అన్ని అర్హతలు కలిగిన 457 మంది జర్నలిస్ట్ లకు 2021-2022 ద్వైవార్షిక కాలానికి అక్రిడిటేషన్లు జారీ చేసామని ఆయన తెలిపారు.  నిబంధనల ప్రకారం సమర్పించాల్సిన కొన్ని డాక్యుమెంట్లు సమర్పించని కారణంగా 1,814 ధరఖాస్తులను పెండింగ్ లో ఉంచడం జరిగిందని, ఏ ధరఖాస్తును తిరస్కరించలేదన్నారు.  నిబంధనలలో నిర్థేశించిన డాక్యుమెంట్లను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసి, వాటి ప్రింట్ కాపీలను సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్ కార్యాలయంలో అందజేసిన యెడల వాటన్నిటినీ జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ తదుపరి సమావేశంలో పరిశీలిస్తుందని ఆయన తెలియజేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జి.రాజకుమారి, హౌసింగ్ పిడి జి.వి.ప్రసాద్, కార్మిక శాఖ అసిస్టెంట్ కమీషనర్ ఎన్.బుల్లిరాణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కె.వి.ఎస్.గౌరీశ్వరరావు, సమాచార శాఖ జాయింట్ డైరక్టర్ ఎల్.స్వర్ణలత, ఆర్టిసి, రైల్వే అధికారులు పాల్గొన్నారు.