కేంద్రం నిధులు సక్రమంగా ఖర్చు చేయాలి..
Ens Balu
5
Anantapur
2020-12-28 21:57:10
అనంతపురం జిల్లాలో వివిధ కేంద్ర పథకాలకు సంబంధించి కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని, నిధుల వినియోగంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని దిశా కమిటీ చైర్మన్, ఎంపీ తలారి రంగయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (DISHA) సమావేశంలో చైర్మన్, ఎంపీ రంగయ్య, కో చైర్మన్, ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్సీ వెన్నెపూస గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉష శ్రీ చరణ్, శ్రీధర్ రెడ్డి, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశంలో భాగంగా దిశా కమిటీ మీటింగ్ అజెండాలోని జల్ జీవన్ మిషన్, నాడు నేడు, కోవిడ్ మేనేజ్మెంట్, నేషనల్ హైవే తదితర వాటిపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ రంగయ్య మాట్లాడుతూ ప్రతి శాఖ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయని, కేంద్ర పథకాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇంతకు ముందు కేంద్రం 75 శాతం, రాష్ట్రం 25 శాతం నిధులు ఖర్చు చేయాల్సిందిగా ఉండేదని, ప్రస్తుతం కేంద్రం 60 శాతం రాష్ట్రం 40 శాతం ఖర్చు చేయాల్సిందిగా వివిధ పథకాల్లో మార్పులు జరిగాయని, వివిధ కేంద్ర పథకాలను దృష్టిలో పెట్టుకొని అధికారులు అంతా సక్రమంగా పని చేయాలన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం నుంచి మరిన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. జిల్లాలో వివిధ కేంద్ర పథకాల కింద చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకువస్తే కేంద్రం దృష్టికి తీసుకువెళ్లే వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులతో కలిసి పనిచేసేందుకు ప్రజాప్రతినిధులు సిద్ధంగా ఉన్నామన్నారు.
జల్ జీవన్ మిషన్ కింద పేదలందరికీ ఇల్లు కింద ఏర్పడనున్న రెండు లక్షల పైచిలుకు ఇల్లు, కొత్త కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ పథకం కింద చేర్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నాడు నేడు పనుల కింద జిల్లాలోని ఆయా నియోజకవర్గాల్లో ఎన్ని పనులు పెండింగ్ ఉన్నాయి అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని పనులు చేసేలా ప్రతిపాదనలు పంపించాలన్నారు. కోవిడ్ సమయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులకు జీతాలు ఇచ్చేలా చూడాలన్నారు. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, అందుబాటులో ఉన్న నిధులను వినియోగించుకొని వాటిని సరిచేయాలని, జాతీయ రహదారుల పైన మధ్యలో గడ్డి పెరుగుతోందని, దానిని తొలగించాలని, పాడైన లైట్లను వేయించాలని, జాతీయ రహదారులపై మెయింటెనెన్స్ చేసే వారి వివరాలు నంబర్లు ప్రదర్శించాలని అధికారులను ఎంపీ ఆదేశించారు.
జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది - దిశా కమిటీ కో చైర్మన్, ఎంపీ గోరంట్ల మాధవ్
జిల్లా సమగ్రంగా అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దిశా కమిటీ కో చైర్మన్, ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో రిపోర్టులను తయారు చేసి మొత్తం వివరాలు తమకు అందజేయాలని, కేంద్రం నుంచి ఎలాంటి సాయం అడిగితే బాగుంటుంది అనే వివరాలు అందించాలన్నారు. జిల్లాలో రైల్వే, రోడ్లు, పర్యాటకం తదితర అంశాల పరిధిలో ఎలాంటి అభివృద్ధి సాధించవచ్చో అధికారులు తెలియజేయాలని సూచించారు. జాతీయ రహదారులపై మొక్కలు కాలిపోతున్నాయని, గడ్డిని కాల్చకుండా తొలగించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
39 గ్రామాలకు నీటి సరఫరా చేయాలి - ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
రాయదుర్గం నియోజకవర్గంలో ఎలాంటి తాగునీటి సిస్టం లేని 39 గ్రామాలకు నీటి సరఫరా చేయాలని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి కోరారు. తమ నియోజకవర్గంలో శ్రీ రామ రెడ్డి తాగునీటి పథకం చేయలేదని, 39 గ్రామాలకు నీటి సరఫరా చేయాలన్నారు. కొన్ని చోట్ల పాఠశాలలు సగం వరకే కట్టి వదిలేశారని వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుండ్లపల్లి నుంచి బొమ్మనహల్ వరకు ఉన్న రహదారిని జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా అభివృద్ధి చేయాలని కోరారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి - జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
జిల్లాలో అమలవుతున్న వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ కింద 2024 లోపు ప్రతి ఇంటికి నీటి కొళాయి కనెక్షన్ ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఒక్కరికి 55 లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉందని, అందుకనుగుణంగా జల్ జీవన్ మిషన్ కింద చేపడుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ ని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి అందులో నీళ్లు వచ్చేలా చూడాలన్నారు. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని 39 గ్రామాల కింద సర్వే పూర్తిచేసి నీటి సరఫరాకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలన్నారు. అలాగే జిల్లాలో పాఠశాలల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించి జాబితా తయారు చేయాలని, జాతీయ రహదారులపై మెయింటెనెన్స్ సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వివిధ కేంద్ర పథకాల అమలుకు సంబంధించి అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు.
జల్ జీవన్ మిషన్ కింద 4 మేజర్ పంచాయతీలను చేర్చాలి - ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి
జల్ జీవన్ మిషన్ కింద అనంతపురం నియోజకవర్గం పరిధిలోని 4 మేజర్ పంచాయతీలను చేర్చాలని, ఇంతవరకు ఎందుకు చేర్చలేదని, వెంటనే ఆయా పంచాయతీలను జల్ జీవన్ మిషన్ కింద చేర్చాలని ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. నాడు నేడు పథకం కింద వచ్చే మార్చి లోపు పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో పని చేసిన డాక్టర్లు, ఉద్యోగులకు ప్రాముఖ్యత ఇవ్వాలని, కోవిడ్ సమయంలో భోజనం అందించిన హోటల్ వాళ్ళ బిల్లులు చెల్లించాలన్నారు. జాతీయ రహదారులపై తపోవనం వద్ద, పామిడి వద్ద ప్రమాదాలు జరిగి ఎక్కువ మంది చనిపోతున్నారని, జాతీయ రహదారిపై లైట్లు వేయాలని, పాడైన రోడ్లను బాగు చేయాలని, నగరంలో జాతీయ రహదారి బ్రిడ్జి కింద అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
కొత్తగా వచ్చే కాలనీలకు నీటి సౌకర్యం కల్పించాలి - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
పేదలందరికీ ఇల్లు కింద కొత్తగా వచ్చే కాలనీలకు నీటి సౌకర్యం కల్పించేలా జల్ జీవన్ మిషన్ కింద, పిఏ బీఆర్ ట్యా0కుల ద్వారా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కోరారు. అలాగే రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని కురుగుంట, వైయస్సార్ కాలనీ, కామారుకాలనీలకు, చెన్నేకొత్తపల్లి కి నీరు అందించేలా చూడాలన్నారు. అనంతపురం - అమరావతి ఎక్స్ ప్రెస్ హైవే కు సంబంధించి భూ సేకరణ పై ప్రత్యేక దృష్టి సారించి జాతీయ రహదారిని పట్టాలెక్కించేలా చూడాలన్నారు. భూసేకరణకు అత్యధిక వ్యయం అవుతుందని చెబుతున్నారని, దీని ద్వారా రహదారి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని దీనిపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సందర్భంగా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పుట్టపర్తి పరిధిలో గత వేసవిలో ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీటి సరఫరా చేశామని, ఇందుకు సంబంధించి బిల్లులు మంజూరు చేయాలని కోరారు. జల్ జీవన్ మిషన్ కింద పుట్టపర్తి నియోజకవర్గం లో పనులు వేగవంతంగా చేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ తిలక్ విద్యాసాగర్, డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ, దిశా కమిటీ సభ్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.