సీఎం వైఎస్ జగన్ పేదల గుండెల్లో నిలిచిపోతారు..
Ens Balu
2
Kerebettu
2020-12-28 23:04:21
ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ.. రాష్ట్రంలో 31లక్షల 75వేల 555 మందికి ఇళ్ల పట్టాలను జగన్ ప్రభుత్వం ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని పేదల హృదయాలలో ముఖ్యమంత్రి శాశ్వతంగా నిలిచిపోతారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. కృష్ణాజిల్లా కోడూరు మండలం స్వతంత్రపురం లో మంత్రి పేర్ని నాని సోమవారం 731 మంది లబ్ధిదారులకు స్థలాలు పంపిణీ చేశారు. అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, గతి లేని పరిస్థితిలో పేదరికం అనుభవిస్తూ అద్దె ఇంటిలో ఒక కప్పు కింద రెండు మూడు కాపురాలు చేస్తూ బతుకు దుర్భరంగా గడుపుతున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఒక పండుగ సందర్భం అని అన్నారు. వివాహమైన కుమారుడు లోపల నిద్రపోతే , ఇంటి వసారాలో తల్లితండ్రులు నిద్రిస్తూ నిత్యం నానా అవస్థలు పడుతున్న పేద వారికి నివేశన స్థలాలు ప్రభుత్వం అందచేయడం ఒక భాగ్యమన్నారు. అలాగే అద్దె కట్టడానికి ఆర్ధిక స్తోమత్తు లేక చెట్టు కిందనో , కాలువ గట్టునో చిన్న పరదా చాటున భారంగా బతుకు ఈడ్చుతున్న వారికి ఇళ్ల స్థలాలు పొందడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. జగన్మోహరెడ్డి తన సుధీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
ఇచ్చిన హామీలు అన్నింటినీ సీఎం జగన్ అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. ప్రజా సంక్షేమానికి పునాదులు వేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 31లక్షల 75వేల 555 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. పట్టాలు ఇవ్వడమే కాక లబ్ధిదారులకు ఇళ్లూ నిర్మించి ఇస్తామని తెలిపారు. తన మచిలీపట్నం నియోజకవర్గంలో 26 వేల మందికి, మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 19 వేలమందికి ఇళ్ల స్థలాలు అందచేయడంతో తన జీవితానికి తగిన సార్ధకత లభించిందని అన్నారు. ఇంటి స్థలం రాలేదని ఏ ఒక్కరూ నిరాశ పడరాదని , అర్హులకు 90 రోజులలో మరల స్ధలాలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇంటి స్థలాలు పొందిన లబ్ధిదారులు అప్పికట్ల నాగలక్ష్మి, కొనకళ్ల శివ నాగమణి, కోడూరు అరుణ, షేక్ హసీనా బేగం, తమ్ము లక్ష్మి,లకు మంత్రి చేతుల మీదుగా ఇంటిస్థలాల పట్టాలను అందచేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె. మాధవీలత , బందరు ఆర్డీవో ఖాజావలి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, దివి మార్కెట్ యార్డ్ చైర్మన్ కడవకొల్లు నరసింహారావు, ఎంపిడీవో సుధా ప్రవీణ, హోసింగ్ డి ఇ భానోజీ రావు తదితరులు పాల్గొన్నారు.