అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు అందాలి..
Ens Balu
2
Anantapur
2020-12-29 13:23:52
అనంతపురం జిల్లాలో అర్హత కలిగిన వారు ఎవరైనా ఉంటే వెంటనే వారికి ఇంటి పట్టా ఇవ్వాలని, ఇందుకు సంబంధించి వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి పరిశీలన చేసి ధృవీకరించుకొని ఎవరైనా అర్హులు ఉంటే 90 రోజుల్లో ఇంటి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. మంగళవారం నవరత్నాలు- పేదలందరికీ ఇల్లు కింద ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమం పై జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి, సబ్ కలెక్టర్ నిషా0తి, హౌసింగ్ పిడి, స్పెషల్ ఆఫీసర్లు, ఆర్డివో లు, తహసీల్దార్లు, హౌసింగ్ అధికారులు, ఏపిడిలు, ఏపీఓ లు, విఆర్వో లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సర్వేయర్లు తదితరులతో జిల్లా కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 25వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు కింద ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామని, భవిష్యత్తులో ఎప్పుడైనా ముఖ్యమంత్రి పర్యటనలు ఉన్నప్పుడు అర్హులు ఎవరైనా ఉండి ఇంటి పట్టా రాకపోతే చేయి పైకి ఎత్తాలని అన్నప్పుడు ఎవరూ చేతులెత్తకుండా అర్హులైన అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పట్టా రాలేదని చెప్పిన వారికి ఎందుకు ఇళ్ల పట్టా రాలేదో విఆర్వో, ఎడ్యుకేషన్ వెల్ఫేర్ సెక్రటరీలు, పంచాయతీ సెక్రటరీలు, వాలంటీర్లు సదరు వ్యక్తికి ఏ కారణం చేత ఇంటి పట్టా ఇవ్వలేదో సమాధానం చెప్పేలా స్పష్టమైన వివరాలతో సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా అర్హులైన లబ్ధిదారులకు ఉంటే వారికి ఇంటి పట్టాలు 90 రోజుల్లోగా వచ్చేలా చూడాలన్నారు.
జిల్లాలో కొన్నిచోట్ల అర్హత కలిగిన వ్యక్తులకు పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వ భూమి ఉన్నమేరకు మాత్రమే పట్టాలు ఇచ్చినట్లు తన దృష్టికి వచ్చిందని, అలా కాకుండా అర్హత కలిగిన వారికి ప్రైవేటు భూమి కొనుగోలు చేసైనా సరే ఖచ్చితంగా పట్టాలు ఇచ్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్హత ఉన్నా పట్టాలు ఇవ్వకపోతే సంబంధిత విఆర్వోలు, తహసిల్దార్ లపై చర్యలు తీసుకునేందుకు వెనకాడమని, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వెంటనే సరిదిద్దుకుని అర్హత ఉన్న వారికి 90 రోజుల్లోగా పట్టాలు ఇచ్చే కార్యక్రమంలోకి చేర్చి వారికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని ప్రతి వాలంటీర్ కూడా వారికి ఇచ్చిన 50, 60 ఇళ్లలో ఎంతమందికి ఇళ్ల పట్టాలు వచ్చాయి, ఎంత మందికి రాలేదు, రాం అటువంటి వారికి ఎందుకు రాలేదు అనేది వివరాలతో సహా సిద్ధం చేసి తమకు పంపించాలన్నారు. అన్ని వివరాలు వాలంటీర్, విఆర్వో, వార్డు కమ్యూనిటీ సెక్రటరీ, విలేజ్ వెల్ఫేర్ సెక్రెటరీ దగ్గర ఖచ్చితంగా ఉండాలన్నారు. ఆయా గ్రామాలలో విఆర్వో, వార్డు కమ్యూనిటీ సెక్రటరీ, విలేజ్ వెల్ఫేర్ సెక్రెటరీ లు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇచ్చాము, మా గ్రామంలో అర్హత ఉన్న ఇంటి పట్టా పొందలేకున్నా వారు ఒక్కరు కూడా లేరని సర్టిఫికెట్ అందించాలన్నారు.
ప్రతి ఒక్క లబ్ధిదారునికి వారికి కేటాయించిన లేఔట్ స్థలంలోనే తక్షణం పట్టా అందించాలని, తహశీల్దార్ లు, ఆర్డీఓలు, సబ్ కలెక్టర్లు సీరియస్ గా తీసుకుని ప్రతి ఒక్కరికి వారి ఫ్లాట్లోనే పట్టాలచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రతి రోజూ ఎంత మందికి ఇంటి పట్టాలు అందించారు అనేది రిపోర్టులు అందించాలని, ఇంటి పట్టాల పంపిణీ కి ఎక్కడైనా డబ్బులు వసూలు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) నిశాంత్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్క లబ్ధిదారునికి వారికి కేటాయించిన ఫ్లాట్లోనే ఇంటి స్థలం పట్టా అందించేలా చూడాలని, ఇది ఒక లబ్ధిదారునికి వారి ఫ్లాట్ ను ఖచ్చితంగా చూపించాలన్నారు. ఇంటి పట్టాల పంపిణీ వేగవంతం చేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఇంటి పట్టాలకు సంబంధించి లబ్ధిదారులను వరుసగా నిలబెట్టి జియో ట్యాగింగ్ చేయాలని, జనవరి 7వ తేదీ లోపు జియో ట్యాగింగ్ పూర్తి చేసేందుకు తహసిల్దార్లు, ఆర్డీవోలు సమన్వయంతో పనిచేయాలన్నారు. లబ్ధిదారులకు ఇళ్ల శాంక్షన్ ప్రొసీడింగ్స్ ను, ఇళ్ల నిర్మాణాలు ఆప్షన్ ఫామ్ లను కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలని సూచించారు.