రైతుల ఖాతాల్లో రూ.46.25 కోట్లు..
Ens Balu
2
Kakinada
2020-12-29 16:04:04
తూర్పుగోదావరి జిల్లాలో నివర్ తుపాను కారణంగా 737 గ్రామాలకు చెందిన 77,381 మంది రైతులు నష్టపోయారని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి నివర్ తుపాను పంట నష్టపరిహారం, రైతు భరోసా సాయం కింద రాష్ట్ర వ్యాప్త రైతుల ఖాతాల్లో మొత్తం రూ.1,766 కోట్లను జమచేసే కార్యక్రమాన్నివీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టరేట్ వివేకానంద సమావేశ మందిరం నుంచి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) డా. జి.లక్ష్మీశ తదితరులతో కలిసి కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి హాజరయ్యారు. జిల్లాలో నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతుల ఖాతాల్లో రూ.46.25 కోట్లు మేర పెట్టుబడి రాయితీ మొత్తం జమవుతుందని ముఖ్యమంత్రికి కలెక్టర్ తెలిపారు. అదే విధంగా 2020-21కు సంబంధించి వైఎస్సార్ రైతుభరోసా-పీఎం కిసాన్ పథకం పరిధిలో చివరి విడత సాయం కింద 4,64,229 మంది రైతుల ఖాతాల్లో రూ.102.27 కోట్లు జమవుతుందని కలెక్టర్ వివరించారు.
పారదర్శక గణన:
జిల్లాలో నవంబర్‌లో సంభవించిన నివర్ తుపాను కారణంగా 47 మండలాల్లో వరి, మినుములు, పత్తి, మొక్కజొన్న, పొగాకు పంటలకు సంబంధించి రైతులు నష్టపోయినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పంట నష్టాల నివేదికలను రూపొందించినట్లు పేర్కొన్నారు. పారదర్శకత, సామాజిక తనిఖీ ప్రక్రియలో భాగంగా జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్ ముగిసేలోపు పెట్టుబడి రాయితీ అందిస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో సీహెచ్ సత్తిబాబు, వ్యవసాయ శాఖ జేడీ కేఎస్‌వీ ప్రసాద్, డీడీఏ ఎస్.మాధవరావు, ఉద్యానశాఖ డీడీ రాంమోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామ రైతు కొనుకు నాగరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడారు. ఆ రైతు మనోగతం ఆయన మాటల్లోనే..
మా ముఖ్యమంత్రి.. రైతుల పక్షపాతి..
రెండున్నర ఎకరాల్లో వరి పంట వేశాం. నవంబర్‌లో నివర్ తుపాను కారణంగా పంట మొత్తం నీట మునిగింది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో గ్రామ వ్యవసాయ సహాయకులు నాతో పాటు గ్రామంలోని రైతులందరి పంట నష్టాల వివరాలు తీసుకున్నారు. ఈ రోజు పరిహారం కింద రూ.13,360 ఖాతాలో జమవుతోంది. ఇలా వెంటనే పరిహారం అందించే పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. రైతుల పక్షపాతిగా నేడు మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. గతంలో బీమా కంపెనీకి ఎకరాకు రూ.625 చెల్లించినా ఎప్పుడూ మా ఖాతాలో రూపాయి పడింది లేదు. కానీ, ఒక్క రూపాయితో రూ.18,034 బీమా మొత్తం నా ఖాతాలో జమయింది. రైతు బాగుంటే గ్రామం బాగుంటుంది.. గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అన్నమహాత్ముని ఆశయాలకు అనుగుణంగా మీరు నేడు పాలన సాగిస్తున్నారు. మ్యానిఫెస్టోలో రైతులకు సంబంధించి పెట్టిన ప్రతి అంశాన్నీ తు.చ.తప్పకుండా అమలుచేస్తున్నందుకు మీకు రైతుల తరఫున ధన్యవాదాలు. మీ మానసపుత్రికలైన రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు వేసింది మొదలు పంట మార్కెటింగ్ వరకు ఎంతో మేలు జరుగుతోంది. నాన్నగారు కంటే మరో అడుగు ముందుకేసి మీరు రైతులకు అండగా ఉంటున్నారు.