ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికీ అందాలి..
Ens Balu
3
Vizianagaram
2020-12-29 16:46:18
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారికి అత్యంత ప్రాధాన్యతనివ్వడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ అన్నారు. వారి సంక్షేమానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను వెచ్చిస్తోందని చెప్పారు. విజయనగరం జిల్లా వ్యవసాయాధారిత జిల్లా అని, రైతు అభివృద్ది చెందితే, జిల్లా కూడా అభివృద్ది చెందుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మూడో విడత వైఎస్ఆర్ రైతు భరోసా, నివార్ తుఫాను బాధితులకు పరిహారాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మంగళవారం తాడిపత్రి నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, రైతులతో ఆయన మాట్లాడారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ హాలులో రైతు భరోసా, నివార్ తుఫాను బాధితులకు పెట్టుబడి రాయితీ సొమ్మునకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ డాక్టర్ హరి జవహర్‌లాల్ రైతులకు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మూడో విడత రైతు భరోసా క్రింద, 2లక్షల, 91వేల, 791 మంది రైతులకు రూ.69.35 కోట్లను విడుదల చేసినట్లు చెప్పారు. కౌలు దారులు, అర్జీదారులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు కూడా ఈ సారి రైతు భరోసాను విడుదల చేసినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగకు ముందే రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. అలాగే నవంబరు నెలలో వచ్చిన నివార్ తుఫాను కారణంగా జిల్లాలోని శృంగవరపుకోట, లక్కవరపుకోట, విజయనగరం, జామి, గంట్యాడ, కొత్తవలస, సీతానగరం మండలాల్లోని సుమారు 564.771 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందన్నారు. దీనివల్ల మొత్తం 2,513 మంది రైతులు నష్టపోయారని, వీరికి పెట్టుబడి రాయితీ క్రింద రూ.84.72కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. తుఫాను నష్టం జరిగిన నెల రోజులలోపే రైతులను ఆదుకోవడం ద్వారా ప్రభుత్వం ఒక కొత్త చరిత్రను సృష్టించిందని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ కె.సింహాచలం, వ్యవసాయశాఖ జెడి ఎం.ఆశాదేవి, ఏడిఏలు ఆర్.శ్రీనివాసరావు, ఎల్.విజయ, వ్యవసాయశాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.