ఇంగ్లండ్ నుంచి వచ్చిన వారందరికీ కరోనా పరీక్షలు..
Ens Balu
3
Visakhapatnam
2020-12-29 17:42:45
ఇంగ్లాండ్ (UK) నుండి విశాఖపట్నం వచ్చిన విమాన ప్రయాణీకులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నవంబర్ 28వ తేదీ నుండి డిశంబరు 25వ తేదీ వరకు ఇంగ్లాండ్ నుంచి జిల్లాకు రెండు విడతలుగా 216 మంది ప్రయాణికులు వచ్చారని వారిలో 209 మందిని గుర్తించామన్నారు. ఏడుగురు ప్రయాణికులు జిల్లా నుండి బయటకు వెళ్లిపోయారని తెలిపారు. వారిలో 192 మందికి కరోనా నెగిటివ్ వచ్చిందని 17 మంది రిజల్ట్ రావాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా ఈ ప్రయాణికులతో సన్నిహితంగా మెలిగిన 580 మందికి పరీక్షలు నిర్వహించగా వారిలో 390 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. 190 మందికి సంబంధించిన రిపోర్టులు రావలసి ఉన్నాయని వెల్లడించారు. వీరిలో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్లయితే "న్యూస్ట్రైన్ సార్స్" నిర్ధారణకు వారి 'స్వాప్' ముందుగా హైదరాబాద్ సిసిఎంబి ల్యాబ్ కు పంపిస్తారని, తర్వాత పూర్తి స్థాయి పరీక్షలకు పూణే పంపించాల్సి ఉంటుందని వివరించారు.