విజయనగరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన..


Ens Balu
1
Vizianagaram
2020-12-29 17:52:01

రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి బుధవారం జిల్లాలో ప‌ర్యటించ‌నున్నారు. న‌వ‌ర‌త్నాల్లో భాగంగా పేద‌లంద‌రికీ ఇళ్లు ప‌థ‌కం క్రింద పట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ఆయ‌న ప్రారంభించ‌నున్నారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాం గ్రామం వ‌ద్ద రూపొందించిన అతిపెద్ద లేఅవుట్‌లో సుమారు 12,301 మంది ల‌బ్దిదారుల‌కు ముఖ్య‌మంత్రి  ప‌ట్టాల‌ పంపిణీ చేస్తారు. ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మానికి జిల్లా యంత్రాంగం అన్నిఏర్పాట్ల‌నూ పూర్తి చేసింది. ఉద‌యం 11.10 గంట‌ల‌కు ముఖ్య‌మంత్రి జిల్లాలో అడుగుపెడ‌తారు. గుంకలాంలో పైలాన్‌ను ఆవిష్క‌రిస్తారు. ఇక్క‌డ నిర్మించిన‌ న‌మూనా ఇంటిని ప‌రిశీలిస్తారు. స‌భావేదిక వ‌ద్ద ఇళ్ల ల‌బ్దిదారుల‌తో ముఖాముఖిలో పాల్గొంటారు. ఇళ్ల ప‌ట్టాల‌ను పంపిణీ చేసి, ఇంటి నిర్మాణాలను ప్రారంభించిన అనంత‌రం సుమారు 1.10 గంటల‌ స‌మ‌యంలో తిరుగుప్ర‌యాణం అవుతారు.                 విజ‌య‌న‌గ‌రం పట్ట‌ణంలోని పేద ప్ర‌జ‌ల క‌ల నెర‌వేరే స‌మ‌యం ఆస‌న్న‌మ‌య్యింది. సుదీర్ఘ నిరీక్ష‌ణ త‌రువాత సుమారు 21,945 మంది ప‌ట్ట‌ణ‌వాసులు సొంత ఇంటివారు కాబోతున్నారు. న‌వ‌ర‌త్నాలు-పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మం క్రింద‌, గుంక‌లాం లేఅవుట్‌లో  12,301 మంది పేద‌ల‌కు నేడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న‌రెడ్డి ప‌ట్టాల‌ను పంపిణీ చేసి, విజ‌య‌న‌గ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో లాంఛ‌నంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తారు. ఈ లేఅవుట్‌లోని ఇళ్ల‌న్నిటినీ మొద‌టి విడ‌త‌లోనే నిర్మాణం చేయ‌నున్నారు. విజ‌య‌న‌గ‌రం ప‌ట్ట‌ణ పేద‌ల‌కోసం గుంక‌లాం, కొండ‌క‌ర‌కాం, జ‌మ్మునారాయ‌ణ‌పురం, సారిక వ‌ద్ద  మొత్తం 554.82 ఎక‌రాల భూమిని సేక‌రించి, సుమారు రూ.5.75 కోట్ల ఖ‌ర్చుతో  నాలుగు లేఅవుట్ల‌ను  రూపొందించారు. ఈ నాలుగు లేఅవుట్ల‌లో ప‌ట్ట‌ణం మొత్తంమీద 21,945 మందికి ప‌ట్టాలు ఇవ్వ‌నున్నారు. వీరిలో న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కం క్రింద 19,662 మంది, స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న 2,283 మంది, టిట్కో ల‌బ్దిదారులు 3,776 మంది ఉన్నారు.  టిట్కో ల‌బ్దిదారుల్లో 300 చ‌ద‌ర‌పు అడుగుల ఇళ్ల ల‌బ్దిదారులు 2016 మంది, 365 చ‌ద‌ర‌పు అడుగుల ల‌బ్దిదారులు 448 మంది, 430 అడుగుల ల‌బ్దిదారులు 1312 మంది ఉన్నారు.              రాష్ట్రంలోని ఇత‌ర జిల్లాల‌తోపాటుగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కూడా ఈ నెల 25నే, విజ‌య‌న‌గ‌రం మిన‌హా మిగిలిన ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇళ్ల ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మంప్రారంభ‌మ‌య్యింది. ఈ కార్య‌క్ర‌మం క్రింద‌  మొత్తం ల‌క్షా, 08వేల‌, 230 మందికి ఇళ్ల ప‌ట్టాలు పంపిణీని ద‌శ‌ల‌వారీగా జ‌న‌వ‌రి 7వ తేదీ వ‌ర‌కు జ‌రుగుతుంది. న‌వ‌ర‌త్నాల్లో భాగ‌మైన పేద‌లంద‌రికీ ఇళ్లు కార్య‌క్ర‌మానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్న 71,249 మందికి, అలాగే 90 రోజుల కార్య‌క్ర‌మం క్రింద స‌చివాల‌యాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ 3,659  మందికి, మొత్తం 74,908 మందికి ఇళ్ల ప‌ట్టాలు మంజూరు చేశారు. అదేవిధంగా 8,048 మందికి టిట్కో ఇళ్లు, గ్రామ‌కంఠాలు త‌దిత‌ర చోట్ల నివాసం ఉంటున్న‌‌‌ 25,261 మందికి,  ఆక్ర‌మిత స్థ‌లాల్లో ఉన్న 13 మందికి పొజిష‌న్ పట్టాల‌ను  మంజూరు చేసి, వారిని సొంత ఇంటివారిని చేయ‌నున్నారు. ల‌బ్దిదారుల్లో 10355 మంది ఎస్సీలు, 7660 మంది ఎస్‌టిలు, 73,970 మంది బిసిలు, 6301 మంది ఓసిలు ఉన్నారు. టిట్కో ల‌బ్దిదారుల్లో 300 చ‌ద‌ర‌పు అడుగుల ఇళ్ల ల‌బ్దిదారులు 5568 మంది, 365 చ‌ద‌ర‌పు అడుగుల ల‌బ్దిదారులు 643 మంది, 430 అడుగుల ల‌బ్దిదారులు 1840 మంది ఉన్నారు.               ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం ఇళ్ల  ప‌ట్టాల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని జిల్లా యంత్రాంగం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. దీనికోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 1164 లేఅవుట్ల‌ను రూపొందించారు. కేవ‌లం భూసేక‌ర‌ణ‌కు సుమారు రూ.228కోట్ల‌ను ఖ‌ర్చు చేశారు. జిల్లా వ్యాప్తంగా తొలిద‌శ ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.1769 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. తొలిద‌శ‌లో 98,286 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి, కేవ‌లం 18 నెల‌ల్లో వీటిని పూర్తి చేసి, రెండో ద‌శ నిర్మాణాన్ని ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు.