అనంతలో 515 మందికి తొలివిడత అక్రిడిటేషన్లు..
Ens Balu
1
Anantapur
2020-12-29 18:38:53
అనంతపురం జిల్లాలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2021-2022 కాల పరిధి కి సంబంధించి అర్హత ఉన్న 515 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రెడిటేషన్ లు మంజూరు చేశామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క ఆక్రెడిటేషన్ దరఖాస్తు ను కూడా రిజెక్ట్ చేయలేదని, జి.ఓ.ఎం.ఎస్ నెంబర్ 142 లో ఉన్న అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించి అర్హులందరికీ అక్రెడిటేషన్ మంజూరు చేశామని తెలిపారు. అర్హత ఉన్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ ఇవ్వడానికి కమిటీ అంగీకారం తెలిపిందన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలో అర్హత ఉన్న 515 మంది జర్నలిస్టులకు మొదటి విడతలో అక్రెడిటేషన్ లు మంజూరు చేశామన్నారు.
అక్రెడిటేషన్ మంజూరు కానివారు రాష్ట్ర సమాచార శాఖ ఆన్ లైన్ /వెబ్ సైట్ ను రీ ఓపెన్ చేసిన వెంటనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సదరు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆ కాపీలను అనంతపురం సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుందన్నారు. అనంతరం అప్లోడ్ చేసిన దరఖాస్తులను పరిశీలన చేసి రెండవ విడత సమావేశంలో అర్హత ఉన్న వారికి అక్రెడిటేషన్ మంజూరు చేయడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటి కన్వీనర్, సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు జయమ్మ , సభ్యులు డిఎంఅండ్హెచ్ఓ డా. కామేశ్వరరావు, కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ రఘురాములు, హౌసింగ్ పిడి వెంకటేశ్వర్రెడ్డి, సౌత్ సెంట్రల్ రైల్వే పి ఆర్ ఓ ప్రశాంత్ కుమార్, ఏపీఎస్ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ హరి కిషోర్, తదితరులు పాల్గొన్నారు.