అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..


Ens Balu
1
Anantapur
2020-12-30 14:38:47

రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ తో కలిసి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే వినూత్నమైన పథకాలతో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ రాజ్యం అమలు చేస్తోందని, నవరత్నాల పథకాలు అమలు అనేది దేశ చరిత్రలోనే పెద్ద సంక్షేమ కార్యక్రమమన్నారు. ఇందులో భాగంగా అమలుచేస్తున్న పేదలందరికీ ఇల్లు కింద 30.75 లక్షల ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలో సంక్రాంతి పండగలా జరుగుతోందన్నారు. 'వైస్సార్ రైతు భరోసా మరియు నవంబర్ లో వర్షాలతో జరిగిన పంట నష్టాలకు సంబంధించిన పంట నష్ట పరిహారంను రైతుల ఖాతాలలోకి జమ చేయడం జరిగిందని, కరుణా లాంటి కష్ట సమయంలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి  ఇచ్చిన మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశారన్నారు.  ఎన్నికల ముందు మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు, చెప్పనవి కూడా 90 శాతం మేరకు అమలు చేశారన్నారు. తుఫాన్ల వల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఒక నెల రోజుల వ్యవధిలోనే పంట నష్టపరిహారం ఇచ్చారని, తన పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలు చూసి మేనిఫెస్టో తయారు చేసి దానిని ఖురాన్, బైబిలు, భగవద్గీత లా భావించి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. రాబోయే రోజులలో నవరత్నాల చుట్టూనే దేశ రాజకీయాలు తిరుగుతాయని, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల అభివృద్ధి కి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం పరిపాలన వికేంద్రీకరణ చేపట్టి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్నారని, రాష్ట్రంలో ఆదర్శవంతంగా పరిపాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, నిష్పక్షపాతంగా ఇంటి పట్టాల పంపిణీ జరుగుతోందన్నారు. ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రికి తన అభినందనలు తెలిపారు.  రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటు, ఫీజు రీయింబర్స్మెంటు, అమ్మఒడి, విద్యా దీవెన, వైయస్సార్ చేయూత, వైయస్సార్ ఆసరా, పెన్షన్ లాంటి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, బీసీల కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి సామాజికంగా, ఆర్థికంగా వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో అట్టడుగున ఉన్న వర్గాలను ఆదుకోవాలని ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థను, సివిల్ సర్వీసెస్ ను దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆదర్శంగా తీసుకుంటున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళలకూ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని, రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధికి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2300 ట్రక్కులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారికి అందజేశామని తెలిపారు.  ఇటీవల దారుణ హత్యకు గురైన అనంతపురానికి చెందిన స్నేహలత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. ఇప్పటికే స్నేహలత కుటుంబ సభ్యులకు ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల భూమి, 10 లక్షల డబ్బు, ఒకరికి ఉద్యోగం అందించామని, నిందితులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించడం కోసమే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యుగంధర్, ఎస్సీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.