ప్రణాళికాబద్ధంగా నవరత్నాల అమలు..


Ens Balu
1
Anantapur
2020-12-30 14:59:00

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో రాష్ట్రంలోని సమస్యలను గుర్తించి ప్రణాళికాబద్ధంగా నిర్ణయం తీసుకొని నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నారని రెల్లి కార్పొరేషన్ చైర్మన్ మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అట్టడుగున ఉన్న వర్గాలకు అండగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంతకుముందు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా అమలు కాని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. అనంతపురంకు స్నేహలత ను దారుణంగా చంపేశారని, స్నేహలత కుటుంబ సభ్యులకు మనోధైర్యం నింపడానికి వారిని పరామర్శించడం జరిగిందని, వారి కుటుంబానికి  అందరి సహకారం అందించాలన్నారు. ఇలాంటి సంఘటనలు సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. సమాజంలో చెడును నిర్మూలించాలని మంచికి సహకారం అందించాలన్నారు. స్నేహలత కుటుంబ సభ్యులకు ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల భూమి, 10 లక్షల డబ్బు, ఒకరికి ఉద్యోగం అందించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల బాగుండాలని కోరుకుంటుందని, రాష్ట్రంలో ఎక్కడా ఇలాంటి తప్పు జరిగినా తక్షణం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేస్తామని, వారికి భద్రత కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యుగంధర్, ఎస్సీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.