అక్కాచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు విరియాలి..
Ens Balu
1
Vizianagaram
2020-12-30 17:08:47
అక్కాచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు ఇళ్ల పట్టాల పంపిణీని ఒక బాధ్యతగా తీసుకున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి అన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని, ఇది ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. సకల వసతులతో వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. విజయనగరం పట్టణ పేదలకోసం గుంకలాం గ్రామం వద్ద రూపొందించిన అతిపెద్ద లేఅవుట్‌లో 12,301 ఇళ్ల పట్టాలను ముఖ్యమంత్రి పంపిణీ చేసి, ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. జిల్లా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో పట్టాల పంపిణీ కార్యక్రమం గుంకలాంలో జరిగింది. ఒకేసారి 12,301 మందికి పట్టాలను పంపిణీ చేయడంతో, ఈ ప్రాంతమంతా కోలహలంగా మారి పండుగ వాతావరణాన్ని తలపించింది. లబ్దిదారుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. వినూత్నంగా జరిగిన ఈ కార్యక్రమంలో, లబ్దిదారులు తమకు కేటాయించిన ఇంటి స్థలంలోనే ఆశీనులై ముఖ్యమంత్రి ప్రసంగాన్ని విన్నారు. తమను సొంత ఇంటివారిని చేసినందుకు జగనన్నకు జేజేలు పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి మాట్లాడుతూ, సొంత ఇంటి కోసం పేదలు కంటున్న కలలను, అద్దె ఇళ్లల్లో వారు పడుతున్న అవస్థలను తన సుదీర్ఘ పాదయాత్రలో గమనించానని అన్నారు. అందుకే నవరత్నాల్లో భాగంగా 25లక్షల ఇళ్లను కట్టిస్తామని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చామని, కానీ అంతకంటే అధికంగా, ఏకంగా 30లక్షల, 75వేల ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది చివరిలో జరుగుతున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం, ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అన్నారు. అన్ని రకలా మౌలిక వసతులతో జగనన్న కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాము ఇళ్లను కాకుండా, ఏకంగా ఊళ్లనే కట్టిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పేదలకు మంచి చేస్తుంటే చూడలేక, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, అతని అనుచర గణం ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డకోడానికి ఎన్నో కుయుక్తులు పన్నారని, కోర్టులను ఆశ్రయించి స్టేలు తెచ్చుకున్నారని అన్నారు. నిరుపేదలకు ఇళ్లు కేటాయిస్తుంటే చూడలేక, కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని, ఇదేమి రాజకీయమని ప్రశ్నించారు. దీనివల్ల పట్టాల పంపిణీలో కొంత జాప్యం జరిగినప్పటికీ, ఇన్నాళ్లకు పేదల కలలను నెరవేర్చామని చెప్పారు. అయినప్పటికీ సుమారు 3,74,000 మందికి చంద్రబాబు పుణ్యాన ఇళ్లు రాకుండా ఆగిపోయాయని, కోర్టు కేసులు పరిష్కరం అయినవెంటనే వీరందరికీ ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని అన్నారు.
ఇళ్లులేని నిరుపేదలందరికీ సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రస్తుతం 30లక్షల, 75వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. వీటిలో 28లక్షల, 30వేల మందికి కొత్తగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, 2.62లక్షల మందికి టిట్కో ఫ్లాట్‌లను ఇస్తున్నామని తెలిపారు. కేవలం పట్టాలను ఇచ్చి వదిలేయకుండా, తొలివిడతగా 15లక్షల, 60వేల ఇళ్లను నిర్మిస్తామని, మలివిడతలో మిగిలినవాటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. సుమారు రూ.7వేల కోట్లతో కాలనీల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి వెళ్లడించారు. లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణాన్ని మూడు పద్దతుల్లో పూర్తి చేసుకోవచ్చని, వాటిని వివరించారు. గుంకలాంలో అతిపెద్ద లేఅవుట్‌ను రూపొందించడం ద్వారా ఒక టౌన్‌షిప్‌నే ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ లేఅవుట్‌లో పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు, పోలీసు స్టేషన్లు, కల్యాణమండపాలు ఇలా ప్రజలకు అవసరమయ్యే ప్రతీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అక్కాచెల్లెమ్మలు అద్దె ఇళ్లల్లో, గుడిసెల్లో పడుతున్న కష్టాలను తొలగించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి లక్షలాది ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం ద్వారా దాదాపు 30 రకాల వృత్తులవారికి ఉపాది దొరకడమే కాకుండా, ఆర్థిక వ్యవస్థకు మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుందని అన్నారు. అలాగే పచ్చదనాన్ని పెంపొందించేందుకు జగనన్న కాలనీల్లో సుమారు 13లక్షల మొక్కలను నాటనున్నట్లు తెలిపారు.
కేవలం 18 నెలల కాలంలోనే కులమత, వర్గ విభేదాలకు తావులేకుండా, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా, అన్ని వర్గాలకు పారదర్శకంగా, అవినీతి రహితంగా ప్రభుత్వ పధకాలను అందజేశామని ముఖ్యమంత్రి చెప్పారు. సుమారు 40లక్షల కుటుంబాలకు అమ్మ ఒడి ద్వారా, అరకోటి మంది రైతులకు రైతు భరోసా ద్వారా, చేయూత పథకం క్రింద 25లక్షల మంది అక్కాచెల్లెమ్మలకు, 87లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా, 18.5లక్షల మంది విద్యార్థులకు విద్యాకానుక, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ది చేకూర్చామని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 62లక్షల మందికి ప్రతీనెలా 1వ తేదీన కోడికూయక ముందే వారి ఇంటికే పింఛన్‌ను పంపిస్తున్నాని అన్నారు. సున్నా వడ్డీద్వారా డ్వాక్రా మహిళలను, రైతులను ఆదుకుంటున్నామన్నారు. రైతుకు బీమా సదుపాయాన్ని కల్పించడమే కాకుండా, గ్రామగ్రామానా రైతు భరోసా కేంద్రాలను పెట్టి, వివిధ రకాల సేవలను వారి ముంగిటకు చేర్చామన్నారు. పంట నష్టం జరిగితే, ఆ జరిగిన సీజన్‌లోనే వారికి పరిహారం అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మార్పులు చేసిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పధకం ద్వారా సుమారు కోటి,35లక్షల మందికి మేలు చేస్తున్నామన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలనను ప్రజల ముంగిటికి చేర్చడమే కాకుండా, లక్షా, 30వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు చెప్పారు. దాదాపు 2.60లక్షల మందిని వాలంటీర్లుగా నియమించామన్నారు. ఇంటిముంగిటకే ఇంగ్లీషు మీడియం చదువులను తెచ్చామన్నారు.
విజయనగరం జిల్లాకు ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి పలు వరాలను ప్రకటించారు. కురుపాంలో మంజూరు చేసిన జెఎన్‌టియు ఇంజనీరింగ్ కళాశాలకు రూ.150కోట్లు కేటాయించామని, టెండర్లు పిలవడం కూడా జరిగిందని చెప్పారు. సాలూరులో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మంజూరవుతుందని, దీనికోసం త్వరలో కేంద్ర బృందం వస్తుందని చెప్పారు. విజయనగరంలో రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించేందుకు జనవరిలో టెండర్లు పిలుస్తామని, మార్చిలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఉత్తరాంధ్రకు మేలు చేకూర్చే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మొదటి దశ పనులు రూ.2వేల కోట్లతో జరుగుతున్నాయని అన్నారు. రూ.4,134 కోట్లతో రెండో దశ పనులను ఇటీవలే మంజూరు చేశామన్నారు. వీటి ద్వారా సుమారు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. తోటపల్లి ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులకు రూ.471కోట్లు మంజూరు చేసి, రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పారు. తారకరామ తీర్ధసాగర్ ప్రాజెక్టుకు రూ.620కోట్లు మంజూరు చేసి, రెండేళ్లలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అదనంగా 5వేల ఎకరాలకు నీరిచ్చే వెంగళరాయసాగర్ ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. రాముడువలస, లోచర్ల ఎత్తిపోతల పథకాలను మంజూరు చేసి, ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. గుంకలాం జగనన్న కాలనీలో మౌలిక సదుపాయల కల్పనకు నిధులు మంజూరు చేసి, 18 నెలల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చారు.