సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకు అందాలి..


Ens Balu
1
Srikakulam
2020-12-30 18:06:22

శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సకాలంలో అందేలా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కృషిచేయాలని సంయుక్త కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గ్రామ, వార్డు సచివాలయాల వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్లు, డెవలప్ మెంట్ సెక్రటరీలకు సంక్షేమ పథకాలపై డివిజనల్ స్థాయి శిక్షణ తరగతులు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జరిగాయి.  ఈ కార్యక్రమానికి జె.సి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని అన్నారు. ప్రతీ సంక్షేమ పథకం ద్వారా అందిస్తున్న లబ్ధి, వర్గం, పథకం అమలుచేసే ప్రభుత్వ శాఖ, అర్హతల వివరాలు క్షుణ్ణంగా తెలిసిఉండాలని సూచించారు. ప్రభుత్వం కుల,మత,పార్టీలకు అతీతంగా పారదర్శకంగా పథకాలను అమలుచేస్తున్నందున అసలైన లబ్ధిదారులను గుర్తించాలని చెప్పారు. అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడు సంక్షేమ పథకాలను నష్టపోరాదని, అలాగే అనర్హులకు ఎట్టి పరిస్థితిల్లో పథకాలు అందరాదని స్పష్టం చేసారు. ఈ విషయంలో సచివాలయ సిబ్బంది నిజాయితీగా పనిచేయాలని వివరించారు. నిజమైన లబ్ధిదారునికి పథకం అమలుకానట్లయితే దానిని అమలుచేసేలా కృషిచేయాలని అన్నారు.  సచివాలయ సిబ్బంది వద్ద సంక్షేమ పథకాలకు సంబంధించిన డైరీ అందుబాటులో ఉంచుకోవాలని, ఆ డైరీలో ప్రభుత్వం అందించే పథకాలతో పాటు లబ్ధిదారుల జాబితా, అనర్హుల వివరాలు ఉండాలని అన్నారు. అనర్హలుగా గుర్తిస్తే అందుకు గల కారణాలను దరఖాస్తుదారునికి స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్లు, జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి మరియు ఇతర అధికారులు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు సిబ్బంది వద్ద సిద్ధంగా ఉండాలన్నారు. జిల్లాలో బాగా పనిచేసే సచివాలయాలు ఉన్నాయని, అదేవిధంగా నామమాత్రంగా పనిచేసే సచివాలయాలు ఉన్నందున ఈ శిక్షణా తరగతులను నిర్వహిస్తున్న సంగతిని ఆయన గుర్తుచేసారు. సంక్షేమ పథకాల అమలులో సచివాలయ సిబ్బంది ఎటువంటి ఒత్తిడులకు తలొగ్గవద్దని, నిజమైన లబ్ధిదారులకు పథకాలు అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరై బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని, మంచి సేవలను అందించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.  ప్రతీ లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు సకాలంలో అందేందుకు సాయశక్తుల కృషిచేయాలని, ప్రభుత్వం అమలుచేసే కొత్త పథకాలు, టెక్నాలజీలపై ఎప్పటికపుడు అప్ డేట్ కావాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ, జిల్లా పరిషత్ ఉప ముఖ్యకార్యనిర్వహణ అధికారి బి.లక్ష్మీపతి, చేనేత మరియు జౌళి శాఖ సహాయ సంచాలకులు యం.పద్మ, డివిజనల్ డెవలప్ మెంట్ ఆఫీసర్ అలివేలు మంగ, డా.కృష్ణప్రసాద్, డి.పి.ఎం ఆర్.వి.రమణ, పలు ప్రభుత్వ శాఖల ప్రతినిధులు, విలేజ్ వెల్ఫేర్, ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, వార్డు వెల్ఫేర్ మరియు డెవలప్ మెంట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.