జర్నలిస్టుల సంక్షేమంలో SCRWA సేవలు భేష్..


Ens Balu
1
Visakhapatnam
2020-12-30 18:25:43

పాత్రికేయుల సంక్షేమంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ) తన మార్కు విజయాలను నమోదు చేసుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. బుధవారం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అసోసియేషన్ డైరీని అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ ఇతర కార్యవర్గంలో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ, అసోసియేషన్ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. భరోసా ఇస్తోందని ఆయన కొనియాడారు. ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ.  ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచిన పాత్రికేయుల సంక్షేమం విషయంలో జర్నలిస్టుల సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పాత్రికేయుల సంక్షేమం కోసం ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. అసోసియేషన్ సభ్యులు ఎంతో ఐక్యతతో వారి సమస్యలు వారి పరిష్కరించుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆత్మీయ అతిధిగా హాజరైన సీనియర్ పాత్రికేయుడు, అసోసియేషన్ గౌరవ సలహాదారు ఎన్.నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. నాలుగేళ్లల్లో సాధించిన ప్రగతిని వివరించారు.  ఉద్యోగాలు కోల్పోయిన జర్నలిస్టులకు కనీసం ఆరు నెలలపాటు ఉపకార వేతనాలు ఇచ్చే విధంగా అసోసియేషన్ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ నాలుగేళ్లల్లో అసోసియేషన్ సాధించిన విజయాలను వెల్లడించారు. స్వల్ప సంఖ్య సభ్యత్వంతో మొదలైన అసోసియేషన్ ప్రయాణం నేడు రెండు వందల మార్కుకు చేరువలో ఉందని తెలిపారు. స్మార్ట్ సిటీ పరిధిలోని అన్ని ప్రాంతాలను అసోసియేషన్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అసోసియేషన్‌కు పక్కా భవనం సమకూర్చుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని వివరించారు. సభ్యులు, వర్కింగ్ జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. ను విజయవంతంగా నడిపిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా డైరీ సహా అసోసియేషన్ ప్రగతి పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. డైరీ ఆవిష్కరణకు ముందు ఎస్.సి.ఆర్.డబ్ల్యు.ఎ. నాలుగేళ్ల ప్రగతి పై రూపొందించిన ఏవీ (ఆడియో, వీడియో)ని విడుదల చేశారు.  అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సత్య, కార్యదర్శి అజయ్ కుమార్, ఉపాధ్యక్షులు కిరణ్, రామకృష్ణ, రిషికేష్, కోశాధికారి అశోక్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి పద్మజ, సునీల్ కుమార్, అనీష్ కుమార్, కార్యవర్గ సభ్యులు ఎల్లాజీ, సూర్య, మదన్, రాజు, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సభ్యులకు మిఠాయిలు , డైరీ పంపిణీ చేశారు. డైరీ కోసం శ్రమించిన అసోసియేషన్ ప్రతినిధులను సత్కరించారు. కార్యక్రమానికి సంధానకర్తగా చైతన్య వ్యవహరించారు.