నాటు సారా ప్రవాహంపై ప్రత్యేక దృష్టి..


Ens Balu
7
Srikakulam
2020-12-30 20:09:17

శ్రీకాకుళం జిల్లాలో నాటు సారా ప్రవాహం దాదాపు ఆగిందని జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అమిత్ బర్దార్ మాట్లాడుతూ, జూలై నెలలలో ప్రారంభమైన జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్.ఇ.బి) ఏర్పాటుతో నాటు సారాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడం జరిగిందన్నారు. ఆంధ్రా ఒడిషా సరిహద్దు ప్రాంతాలపై దృష్టి సారించి, ఒడిషా పోలీసుల సంయుక్త సహకారంతో దాడులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. గంగాపూర్, రామచంద్రాపురం, కొండ బీజాపూర్ ప్రాంతాలలో దాడులు నిర్వహించి వేల ఎకరాల నాటు సారా ఊటను ధ్వంసం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆయా గ్రామాల పరిధిలో నాటు సారా తయారు చేసి సరిహద్దులు దాటి ఆంధ్రాలో ప్రవేశించడం జరుగుతోందని ఎస్.పి చెప్పారు.  గోంగాపూర్  గ్రామ పరిధిలో 27,600 లీటర్ల బెల్లపు ఊట,  250 లీటర్ల నాటు సారాను, రామచంద్రపూర్ గ్రామ పరిధిలో 6 వేల లీటర్ల బెల్లపు ఊటను,  కొండబీజాపూర్ గ్రామ పరిధిలో 4,800 లీటర్ల బెల్లపు ఉటను, 20 లీటర్ల నాటుసారాని  వెరశి 38,400 లీటర్ల బెల్లపు ఉట, 270 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారని పేర్కొన్నారు. మూడు కేసులు నమోదు చేయడం జరిగిందని, సరిహద్దు ప్రాంతాల నుండి నాటు సారా రవాణా లపై ప్రతేక నిఘా వుంచి, నాటుసారా తయారీ స్థావరాలపై మెరుపు దాడి చేసి పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని తెలియజేశారు. వీరఘట్టాం, హిరమండలం, పాతపట్నం, మందస, సోంపేట తదితర ప్రాంతాల దగ్గరలోగల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న ముఖ్యమైన అక్రమ తయారీ స్థావరాలపై నిరంతరం దాడులు నిర్వహిస్తామని పేర్కొన్నారు.  ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్.పి కె.శ్రీనివాస రావు పాల్గొన్నారు.