రాత్రి 9గంగల వరకే మద్యం అమ్మకాలు..
Ens Balu
2
Srikakulam
2020-12-30 20:12:22
నూతన సంవత్సర వేడుకలలో భాగంగా డిశంబరు 31న మద్యం దుకాణాలకు రాత్రి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నట్లు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ అమిత్ బర్దార్ తెలిపారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్ కార్యాలయంలో బుధ వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో అమిత్ బర్దార్ మాట్లాడుతూ ప్రజలు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజలు సుఖ, శాంతులతో జీవించాలని, వారి ఆకాంక్షలు నెరవేరాలని వాంచించారు. కరోనా దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు సాధారణంగా జరుపుకోవాలని కోరారు. డిశంబరు 31న మద్యం దుకాణాలకు రాత్రి 9 గంటల వరకు, బార్ అండ్ రెస్టారెంట్లకు రాత్రి 11 గంటల వరకు, హోటళ్ళకు రాత్రి 12 గంటల వరకు అనుమతించడం జరుగుతుందని వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపైన, బహిరంగంగా మద్యం సేవించిన వారిపైనా, మద్యం సేవించి అమర్యాదకరంగా ప్రవర్తించే వారిపైన కఠిన చర్యలు చేపడతామని ఆయన హెచ్చరించారు. బాణా సంచాకు అనుమతించడం లేదని ఆయన స్పష్టం చేసారు. అధిక మొత్తంలో అపరాధ రుసుములు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. పోలీసు బీట్లు అధికం చేస్తామని, ఎల్.సి.సి.ఓ మీటర్లను రహదారులపై ఏర్పాటు చేస్తున్నామని, సిసి కెమెరా నిఘా ఉంటుందని ఎస్.పి తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు.
జిల్లాలో క్రైమ్ తగ్గుముఖం : జిల్లాలో 2020 సంవత్సరంలో క్రైమ్ బాగా తగ్గుముఖం పట్టిందని అమిత్ బర్దార్ తెలిపారు. మర్డర్లు సంభవించలేదని, సాధారణ దొంగతనాల కేసులు 28.86 శాతం, మోసాలు 51 శాతం, 307 ఐపిసి కేసులు 21 శాతం, ప్రమాదాలలో మరణాలు 5.61 శాతం, గేమింగు చట్ట పరిధి క్రింద 21 శాతం, ఎక్సైజ్ చట్ట పరిధి క్రింద కేసులు 17 శాతం తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో అదనపు ఎస్.పి కె.శ్రీనివాస రావు పాల్గొన్నారు.