ప్రమాదాల నియంత్రకు పటిష్ట చర్యలు..


Ens Balu
4
Visakhapatnam
2020-12-30 21:09:37

విశాఖ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత విస్తృతం చేయాలని జాయింట్ కలెక్టరు సంబంధిత అధికారులను ఆదేశించారు.  బుధవారం కలక్టరేట్ లో నిర్వహించిన రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను జనవరి 6,8,9 తేదీలలో ఆర్టీవో, పోలీస్, నేషనల్ హైవే అథారిటీ, జివియంసి అధికారులు సయుక్తంగా తనిఖీ చేయాలన్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం వున్న ప్రదేశాల దగ్గర తగిన చిహ్నాలను హెచ్చరికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను, ప్రమాదాలు సంభవించే అవకాశం వున్న ప్రదేశాలను గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై ఏర్పడే గుంతలను ఎప్పటికప్పుడు  మరమ్మత్తులు చేయాలన్నారు.   అవసరమైన చోట బారికేడ్లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పరచాలన్నారు.  ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశాలలో రోడ్లను వెడల్పు చేయడం, తగిన సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు.  పార్కింగ్ లో కాకుండా రోడ్లపై నిలిపిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  ఎక్కువమంది పాదచారులు రోడ్లను దాటే ప్రదేశాలు, సమయాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో పోలీసులకు సహాయంలో వలంటీర్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలు జరిగిన కారణాలపై లోతుగా పరిశీలన చేసి చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రత పై వాహనదారులకు, పాదచారులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు.  డి.టి.సి.  జి.సి.రాజరత్నం  సమావేశం ప్రారంభంలో గతంలో కమిటీ చేసిన సూచనల పై తీసుకున్న చర్యలను వివరించారు. ఈ సమావేశంలో అడిషనల్ సి.పి. (ట్రాఫిక్) సి.హెచ్. ఆదినారాయణ, ఆర్.టి.సి. రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు, కె.జి.హెచ్. సూపరిటెండెంట్ డాక్టర్ మైథిలి, జి.వి. యం.సి.  ఎస్.ఈ.  శాంసన్ రాజు, నేషనల్ హైవే అథరాటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.