31న జిల్లాలో ప్రత్యేక ఆంక్షలు..


Ens Balu
1
Anantapur
2020-12-30 21:32:58

అనంతపురం జిల్లాలో డిశంబర్ 31 న ఎలాంటి ఘటనలకు తావులేకుండా చర్యలు చేపట్టామని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు పేర్కొన్నారు.  ప్రజలు గుమిగూడటం... బహిరంగ ప్రదేశాలు, రహదారులపై కేక్ కటింగ్ లు చేయడం నిషేధమన్నారు. హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సంస్ధలు నిర్ణీత సమయాల్లోనే  కచ్చితంగా మూసేయాలన్నారు. మద్యంకు అనుమతి లేని ప్రదేశాల్లో మత్తు పానీయాలు సేవించినా, అందుకు ఏర్పాట్లు సమకూర్చినా చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆ రోజు ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. డ్రంకన్ డ్రైవ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ప్రధాన పట్టణాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తామన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపటమే కాకుండా వాటికి సంబంధించిన సైలెన్సర్లు తొలగించి అధిక శబ్దాలతో ఇతరులను ఇబ్బంది పెడితే అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. వీటితోపాటు బైక్ రేస్ లు, త్రిబుల్ రైడింగ్, మైనర్లు రైడింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చినా అటువంటి వారి పట్ల కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా  చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్ 31 వ తేది రాత్రి  30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందన్నారు. కోవిడ్ -19 నిబంధనలను పాటించాలన్నారు. పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. ఆ రోజు ఇంటి నుండీ బయటికెళ్లే ముందు పిల్లలకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునేలా సూచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. అనంతపురం ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పోలీసులతో అందరూ సహకరించాలని ఆయన కోరారు.