కొత్త సంవత్సరం అంతా మంచి జరగాలి..
Ens Balu
3
Srikakulam
2020-12-31 14:09:30
నూతన సంవత్సరం భోగ భాగ్యాలను జిల్లా ప్రజలకు సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆకాంక్షించారు. జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను గురు వారం తెలియజేస్తూ నా ప్రియమైన ప్రజలందరికి నూతన సంవత్సరం మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అందించాలని ఆకాంక్షించారు. నూతన ఉత్తేజాన్ని కల్పిస్తూ ప్రతి కుటుంబం ఆర్ధికంగా ప్రగతి పథంలో సాగాలని ఆయన పేర్కొన్నారు. 2020 సంవత్సరం కరోనాతో ఇబ్బందులకు గురి అయ్యామని ఆయన పేర్కొంటూ ప్రజల సహకారంతో సమర్ధవంతంగా నివారణకు చర్యలు చేపట్టామన్నారు. వాక్సిన్ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. కుటుంబం యావత్తు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నిజమైన సంతోషం లభిస్తుందన్నారు. నూతన సంవత్సర వేడుకలు ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్య చేసుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా నివారణ జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లోనే కుటుంబ సభ్యులు వేడుకలు చేసుకోవాలని సూచించారు. బయటకు వెళ్ళ వద్దని ఆయన కోరారు.
నూతన సంవత్సర వేడుకలు రద్దు : జిల్లా కలెక్టర్ కార్యాలయం, క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలను రద్దు చేస్తున్నట్లు నివాస్ ప్రకటించారు. కరోనా రెండవ దశ వ్యాప్తిలో ఉందని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. జిల్లాలో ప్రజల సహకారంతో కరోనా తగ్గు ముఖం మాత్రమే పట్టిందని, పూర్తిగా నిర్మూలన కాలేదని కావున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. నూతన సవంత్సర వేడుకల శుభాకాంక్షలు తెలియజేయుటకు ఎవరూ రావద్దని ఆయన విజ్ఞప్తి చేసారు. అందరూ కరోనా నివారణలో భాగస్వామ్యమై, సమూలంగా నిర్మూలన చేసి పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించుకుందామని సూచించారు. మాస్కు ధారణ మరవవద్దని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపరచుకోవాలని ఆయన కోరారు.