జనవరి 7లోగా ఇళ్ల స్థలాల పంపిణీ పూర్తికావాలి..


Ens Balu
2
Vizianagaram
2020-12-31 20:42:23

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికి ఇళ్లు పథకం క్రింద పట్టాల పంపిణీ, పొజిషన్ సర్టిఫికేట్  జనవరి 7లోగా లబ్దిదారులందరికి అందాలని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  ఆదేశించారు.  గురువారం తహశీల్దార్లు, ఎంపిడిఓలు, ఎపియంలతో ఇళ్ల పట్టాలు, జగనన్న తోడు, పింఛన్లు పంపిణీ, వై.ఎస్.ఆర్.భీమా, వై.ఎస్.ఆర్. చేయూత తదితర పథకాలపై జిల్లా కలెక్టర్ మండలం వారీగా వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్షించారు.  ఈ కార్యక్రమానికి రెండు బృందాలుగా ఏర్పడి, ఒక బృందం పట్టాలు తయారు చేయాలని, రెండువ బృందం పంపిణీ చేస్తూవుండాలని సూచించారు.  సంబంధిత శాసన సభ్యులతో మాట్లాడి నిర్థేశిత గడువులో పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించారు.  7వ తేదీలోగా పంపిణీ చేయలేని ఇళ్ల పట్టాల గురించి కారణాలు వ్రాస్తు వివరణ సమర్పించవలసివుంటుందన్నారు.  డిసెంబరు 25 నుండి పంపిణీ మొదలయిందని, ఇప్పటికే వారం పూర్తయినందున,  ఇప్పటికే 50 శాతం పైన పూర్తిచేయవలసివుందని కాని కొన్ని మండలాలలో 20, 30 శాతం చేసారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఇకపై ప్రతీరోజు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.  పింఛన్లు పంపిణీకి సంబంధించి మొదటిరోజే శతశాతం పంపిణీ చేసి ఎప్పటిలాగే రాష్ట్రంలో జిల్లా ప్రధమంగా నిలిచేలా చూడాలన్నారు.   తోడు పథకం క్రింద అందిన దఖాస్తులపై ఎక్కువగా బ్యాంకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయని, వారితో మాట్లాడుకొని అక్కడికక్కడే పరిష్కరించుకోవాలన్నారు.  తక్కువ పనితీరు చూపిన మండలాలలో కారణాలపై బ్యాంకర్లతో ఎల్.డి.ఎం. శ్రీనివాస్ మాట్లాడారు.  వై.ఎస్.ఆర్. భీమా క్రింద పూసపాటిరేగ, మెరకముడిదాం, భోగాపురం మండలాలు,  బొబ్బిలి, పార్వతీపురం, విజయనగరం, సాలూరు మున్సిపాలిటీలలో ఎక్కువ  దరఖాస్తులు పెండింగు వున్నాయని, వాటిని ఆయా బ్యాంకులతో మాట్లాడి రెండురోజుల్లో శతశాతం సాంధించేలా చూడాలన్నారు.  చేయూత పథకం క్రింద ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు కోసం వచ్చిన దరఖాస్తులను రుణాల కోసం వెంటనే బ్యాంకులకు పంపాలని ఆదేశించారు.          ప్రభుత్వం పథకాల అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఎంపిడిఓలకు, ఎపిఎంలకు, బ్యాంకుర్లకు కూడా   రిపబ్లిక్ డే  సందర్భంగా ఉత్తమ సేవా పథకాలు అందించడం జరుగుతుందన్నారు.      ఈ వీడియో కాన్ఫెరెన్సులో సహాయ కలెక్టర్ కె.సింహాచలం, డిఆర్ఓ గణపతిరావు, పిడి డిఆర్డిఎ సుబ్బారావు, పశుసంవర్థక శాఖ జె.డి. డా.నరసింహులు, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.