చిరువ్యాపారుల జీవనోపాది కల్పన..
Ens Balu
2
Kakinada
2021-01-01 13:08:22
తూర్పుగోదావరి జిల్లాలో వీధి విక్రయదారులు, చిరువ్యాపారులకు సుస్థిర ఆదాయం లభించే జీవనోపాధి కల్పనకు ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేస్తున్నట్లు కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కాకినాడ మెక్లారిన్ గ్రౌండ్స్, అచ్యుతరామయ్య వీధిలో కాకినాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హరిత వీధి విక్రయ జోన్ (గ్రీన్ వెండింగ్ జోన్)ను ఎస్‌పీ అద్నాన్ నయీం అస్మీ, జాయింట్ కలెక్టర్లు డా. జి.లక్ష్మీశ, కీర్తి చేకూరి, జి.రాజకుమారి, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. స్ట్రీట్ ఫుడ్ కేంద్రాల వ్యాపారులతో మాట్లాడారు. అధికారులతో కలిసి అల్పాహారం తీసుకొని, ఆన్‌లైన్‌లో బిల్లు చెల్లించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వ్యాపారులకు సూచించారు. బ్యాంకుల నుంచి కాకుండా బయట వ్యాపారుల వద్ద రుణాలు తీసుకొని వడ్డీల ఊబిలో కూరుకుపోవద్దన్నారు. చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకు పీఎం స్వనిధి-జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల సహకారంతో రూ.10 వేలు అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ రుణంపై సంవత్సర వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. తోపుడుబండ్లు, ఇతర వాహనాల ద్వారా వ్యాపారం చేసుకునే వీధి విక్రయదారులకు నాణ్యమైన జీవనోపాధి కల్పన లక్ష్యంగా కాకినాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రాంతాల్లో హరిత వీధి విక్రయ జోన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ విధానం వల్ల ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభించడమే కాకుండా ప్రజలకు శుచిశుభ్రతతో కూడిన అల్పాహార విక్రయానికి వీలవుతుందన్నారు. వీధి విక్రయదారులకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమం సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2021లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, జెడ్‌పీ సీఈవో ఎన్‌వీవీ సత్యనారాయణ, డీఆర్‌డీఏ పీడీ వై.హరిహరనాథ్, మెప్మా పీడీ కె.శ్రీరమణి, డీఎంహెచ్‌వో కేవీఎస్ గౌరీశ్వరరావు, మెప్మా పీడీ కె.శ్రీరమణి, కాకినాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు తదితరులు పాల్గొన్నారు.