హెచ్.ఐ.వి బాధితులకు జీవన జ్యోతి..
Ens Balu
2
Srikakulam
2021-01-01 16:39:07
అనాథ హెచ్.ఐ.వి. బాధితులకు పౌష్టికాహారం అందించే కార్యక్రమాన్ని నూతన సంవత్సరం సందర్భంగా శుక్ర వారం జిల్లా కలెక్టర్ జె నివాస్ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు. హెచ్.ఐ.వితో బాధపడటం అందులోనూ అనాథలుగా ఉండటం వంటి అంశాలను స్వయంగా గ్రహించిన జిల్లా కలెక్టర్ కు మానవతాధృక్పధాన్ని మరో సారి చాటుకున్నారు. పేద, బడుగు వర్గాలకు ఎప్పుడూ అండగా ఉండేందుకు ఆలోచించే కలెక్టర్ నివాస్ మానస పుత్రికగా జీవన జ్యోతి ఆవిర్భవించింది. జిల్లాలో అనాధలుగా ఉన్న చిన్నారులు హెచ్.ఐ.వితో బాధపడుతున్నారని తెలుసుకున్న నివాస్ తక్షణం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాలని సంకల్పించారు. దీని కొరకు విరాళాలు సేకరించి తద్వారా వచ్చిన ఆదాయంతో నడపుటకు నిర్ణయించారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రూ.31 లక్షలు, వివిధ శాఖల ఉద్యోగులు తదితరులు అందించిన విరాళాలు దాదాపుగా కోటి రూపాయలు కార్పస్ నిధిగా ఏర్పాటు చేయడం జరిగింది.
జనవరి నుండి వంద మంది హెచ్.ఐ.వి బాధితులకు పౌష్టికాహారం అందించుటకు గాను ప్రణాళిక శాఖకు చెందిన ఉద్యోగులు ముఖ్య ప్రణాళిక అధికారి ఎం.మోహన రావు నేతృత్వంలో రూ.1,00,116 చెక్కును జిల్లా కలెక్టర్ కు అందజేసారు. ఈ నిధులతో ఈ నెల 25 కిలోల బియ్యం, 2 కిలోల గోధుమ పిండి, ఒక కిలో పప్పు, రెండు కిలోల పంచదార, ఒక హార్లిక్స్ ప్యాకెట్, గ్రుడ్లు అందించడం నిర్ణయించారు. జిల్లా రెడ్ క్రాస్ సంస్ధ సభ్యులు విరాళంగా అందించిన దాదాపు రూ.3 లక్షలతో ఆరు నెలల కాలం బియ్యం మినహా ఇతర పౌష్టికాహారంతోపాటు మిగిలిన సరుకులు అందించుటకు నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బెజ్జిపురం యూత్ క్లబ్ రూ.10 వేలు విరాళంగా అందించడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్.ఐ.వి బాధితులకు మంచి పౌష్టికాహారం అవశ్యమన్నారు. పౌష్టికాహారం అందించుటకు జీవన జ్యోతి కార్యక్రమాన్ని రూపకల్పన చేసామన్నారు. ఇప్పటి వరకు స్వయం సహాయక సంఘాలు, ఉద్యోగులు, సంస్ధలు విరాళంగా అందిస్తూ మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. సమాజంలో వివిధ కారణాల వలన వివిధ సామాజిక రుగ్మతలతో కొంత మంది బాధపడుతున్నారని, అందులో చిన్నారులు కూడా ఉండటం విచారకరమన్నారు. నూతన సంవత్సరం నుండి వారి బాధలు తొలగాలని, వారికి మంచి భవిష్యత్తు చేకూరాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలు సామాజిక బాధ్యతతో కూడిన కార్యక్రమాలని ఆయన పేర్కొంటూ ఎంతో మంది సుహృయులు ఉన్నారని వారు ముందుకు వచ్చి విరాళాలు అందించి బాధితుల అభ్యున్నతికి తోడ్పాటును అందించాలని కోరారు.
ప్రణాళిక శాఖ ఉద్యోగులు విరాళాలు అందించుటకు ఎప్పుడూ ముందుండటం ప్రశంసనీయమని ఆయన అన్నారు. 2020 సంవత్సరం కరోనాతో సమస్యలు ఎదుర్కొన్నామని, 2021 సంవత్సరంలో కరోనా పూర్తిగా అంతమై ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉండి హాయిగా ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. జీవన జ్యోతి కార్యక్రమాన్ని డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. దుర్గా ప్రసాద్ అనే 18 సంవత్సరాల బాలుడు ఉదర సంబంధిత వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తక్షణం స్పందించి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మంచి వైద్యం అందించుటకు ఆదేశించారు. రెడ్ క్రాస్ నుండి నెలకు రెండు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని కొద్ది నెలలపాటు అందించాలని రెడ్ క్రాస్ అధ్యక్షులు పి.జగన్మోహన రావును ఆదేశించారు.
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు డైరక్టర్ బి.శాంతి శ్రీ మాట్లాడుతూ, హెచ్.ఐ.వి బాధితులకు మందులతో పాటు చక్కని పౌష్టికాహారం అందంచాలని తద్వారా ఆరోగ్యం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్ష అన్నారు. ఇందులో భాగంగా జీవన జ్యోతి కార్యక్రమం చేపట్టామని చెప్పారు. జీవన జ్యోతి కార్యక్రమానికి దాతలు విరాళాలను అందించవచ్చని చెప్పారు. జీవన జ్యోతి అకౌంట్ నంబరు – 142710100074446, ఐ.ఎఫ్.సి కోడ్ యు.బి.ఐ.ఎన్ 0814270, యూనియన్ బ్యాంకు, కలెక్టరేట్ బ్రాంచ్ కు అందించవచ్చని కోరారు.
ఈ కార్యక్రమంలో బెజ్జిపురం యూత్ క్లబ్ అధ్యక్షులు ఎం.ప్రసాద రావు, రెడ్ క్రాస్ సభ్యులు పెంకి చైతన్య కుమార్, డి.ఆర్.డి.ఏ పరిపాలన అధికారి దొర, సి.పి.ఓ కార్యాలయ డిప్యూటి ఎస్.ఓ వరహాల రావు, సంజీవ్ కుమార్, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.