అనంతలో మూడు చోట్ల డ్రై రన్..
Ens Balu
3
Anantapur
2021-01-01 16:47:15
కోవిడ్ వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో ఈ నెల 2వ తేదీన శనివారం డ్రై రన్ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ (గ్రామ,వార్డు సచివాలయాలు మరియు అభివృద్ధి) ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం నగరంలోని జిల్లా జాయింట్ కలెక్టర్ (గ్రా,వా, స మరియు అభివృద్ధి) క్యాంపు కార్యాలయంలో కోవిడ్ వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన డ్రై రన్ నిర్వహణపై జిల్లా టాస్క్ఫోర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సిన్ రానున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న డ్రై రన్ అనేది ఎలాంటి వ్యాక్సిన్ వేయకుండా నిర్వహించే ఒక మాక్ డ్రిల్ లాంటిదన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించి డ్రై రన్ ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
నగరంలో 3 చోట్ల డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు :
జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాల మేరకు అనంతపురం నగరంలో 3 చోట్ల డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు జెసి తెలిపారు. డ్రై రన్ ను నగరంలోని ఇందిరా గాంధీ నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్ లో, కిమ్స్ సవేరా హాస్పెటల్ లో, కురుగుంట పీహెచ్సీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో సెంటర్లో 3 రూములు ఏర్పాటు చేయాలని, ఒకటి వెయిటింగ్ రూము, రెండోది వ్యాక్సినేషన్ రూమ్, మూడోది అబ్జర్వేషన్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఒక్క సెంటర్ లోనూ ఎంట్రెన్స్ లో పోలీస్, వెయిటింగ్ రూం లో డిజిటల్ అసిస్టెంట్, వ్యాక్సినేషన్ రూం లో ఏ ఎన్ ఎం లేదా స్టాఫ్ నర్స్ లేదా సూపర్ వైజర్ లేదా మెడికల్ అధికారి ఉండాలని, అబ్జర్వేషన్ రూం లో ఆశా వర్కర్ లేదా ఏ ఎన్ ఎం లు ఖచ్చితంగా అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి ఒక్క సెంటర్ వద్ద 108 వాహనం సిద్ధంగా ఉండాలన్నారు.
ముందుగా డ్రై రన్ లో వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చే వారి ఐడి కార్డు (ఆధార్ కార్డు కాకుండా మరో ఐడి కార్డు)ను పోలీస్ చెక్ చేసి పంపించాలన్నారు. డిజిటల్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ పూర్తిచేస్తారని, అనంతరం వ్యాక్సినేషన్ రూం లో వ్యాక్సిన్ ను ఏఎన్ఎం లేదా స్టాఫ్ నర్స్ ఇస్తారని, తదనంతరం అబ్జర్వేషన్ రూంలో వ్యాక్సిన్ ను తీసుకున్న వారిని అరగంట ఉంచి వ్యాక్సిన్ వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని పరిశీలన చేస్తారన్నారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారన్నారు.
డ్రై రన్ లో వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చేవారికి సంబంధించి కోవిన్ యాప్ లో అప్లికేషన్లు సిద్ధం చేశామని, యాప్ ద్వారా రోజు ఎవరు వ్యాక్సిన్ తీసుకోవాలో ప్రతి రోజు ఎస్ ఎంఎస్ ద్వారా మెస్సేజ్ పంపించడం జరుగుతుందన్నారు. కోవిన్ యాప్ లో అప్లికేషన్లు ఎలా పనిచేస్తున్నాయి అనేది పరిశీలించాలన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేయాలి అనేది డ్రై రన్ నిర్వహణ ద్వారా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా పని చేసి డ్రై రన్ విజయవంతం చేయాలన్నారు. శనివారం ఉదయం 8:30 గంటల నుంచి కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహిస్తామని, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ డ్రై రన్ నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని జేసీ ఆదేశించారు.
కోవిడ్ వ్యాక్సిన్ త్వరలో రానున్న నేపథ్యంలో మొదటి దశలో అన్ని రకాల ఆరోగ్య సిబ్బందికి, రెండవ దశలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి, 50 ఏళ్ళు పై బడిన వారికి, 50 ఏళ్ల లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, మూడవ దశలో ప్రజలకు కోవిడ్ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక సెంటర్లో ప్రతిరోజూ వంద మందికి వ్యాక్సిన్ వేస్తామన్నారు.
ఈ సమావేశంలో డిఎంఅండ్హెచ్ఓ కామేశ్వర ప్రసాద్, డి సి హెచ్ఎస్ రమేష్ నాథ్, డీఈఓ శామ్యూల్, డ్వామా పిడి వేణుగోపాల్ రెడ్డి, డి ఐ ఓ గంగాధర్ రెడ్డి, ఎం హెచ్ వో రాజేష్, ప్రభుత్వ ఆసుపత్రి విభాగాధిపతి డా. సంధ్య, డిటిసి శివశంకర్, తదితరులు పాల్గొన్నారు.