ఆసుపత్రికి వెళ్లి మరీ పించన్లు అందజేత..
Ens Balu
3
Vizianagaram
2021-01-01 19:02:28
విజయనగరం జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను పక్కనబెట్టి, మొదటి రోజే జిల్లా యంత్రాంగం పింఛన్ల పంపిణీని దాదాపు పూర్తి చేసింది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం 5 గంటలకే వలంటీర్లు, సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి, బయోమెట్రిక్ తీసుకొని పింఛన్ సొమ్ము అందజేశారు. పొలాల్లోకి వెళ్లి, పొలం పనులు చేస్తున్న వారికి కూడా, వారి పింఛన్ సొమ్ము ముట్టజెప్పారు. అలాగే ఆసుపత్రిలో చేరిన వృద్దులకు కూడా, వారు ఉన్న వార్డులోకి వెళ్లి పింఛన్ ఇచ్చారు. దత్తి రాజేరు మండలం గడసాం గ్రామానికి చెందిన వృద్ధుడు ఇమంది ఆదినారాయణ అనారోగ్యంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చేరగా, గ్రామ వాలంటీర్ పైడిరాజు పెద్దాసుపత్రికి వెళ్లి పింఛన్ అందజేశారు. మొత్తం మీద జిల్లాలో మొదటి రోజే సుమారు 95 శాతం మందికి పింఛన్ పంపిణీ పూర్తి అయింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ ఆధ్వర్యంలో, డిఆర్డీఏ పిడి కె.సుబ్బారావు, ఇతర సిబ్బంది ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.