శ్రీకాకుళంలో డ్రైరన్ విజయవంతం..


Ens Balu
2
Srikakulam
2021-01-02 14:15:54

శ్రీకాకుళం కోవిడ్ వాక్సిన్ డ్రై రన్ శనివారం విజయవంతంగా ముగిసింది. జిల్లాలో శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, జెమ్స్ లతో పాటు పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డ్రై రన్ ను నిర్వహించారు. కోవిడ్ వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని పక్కాగా నిర్వహించుటకు ముందుగా ఈ డ్రై రన్ ను నిర్వహించారు. ప్రతి కేంద్రంలో వేచి యుండుగది, వాక్సిన్ వేసే గది, వాక్సిన్ అనంతరం వ్యక్తుల స్ధితిగతులను పరిశీలించే గది (అబ్జర్వేషన్ రూమ్) ని ఏర్పాటు చేసారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కోల్డు చైన్ స్టోరేజ్ ప్రదేశాన్ని  ఏర్పాటు చేసారు. వాక్సిన్ నిల్వ చేసే ప్రదేశం నుండి వాక్సిన్ కేంద్రం వరకు వాక్సిన్ ను రవాణా చేయడం, వాక్సిన ఇచ్చే విధానాన్ని డ్రై రన్ లో నిర్వహించారు. ఇందుకు ప్రతి కేంద్రంలో 25 మందితో వాక్సిన్ డ్రైరన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాక్సిన్ వేయించుకునే వ్యక్తి పేరు వాక్సిన్ జాబితాలో విధిగా నమోదై ఉండాలి. వాక్సిన్ జాబితాలో ఉన్న వ్యక్తి వాక్సిన్ వేయించుకొనుటకు గుర్తింపు కార్డుతో రావలసి ఉంటుంది.  వాక్సిన్ కేంద్రం వద్ద జాబితాలో పేరు పరిశీలించి,  గుర్తింపు కార్డు ఉంటే వాక్సిన్ కేంద్రంలోని వేచి యుండు గదిలోకి పంపడం జరిగింది. వేచి యుండు గదిలో ఏర్పాటు చేసిన ఆన్ లైన్ విధానంలో వాక్సిన్ కు వచ్చిన వ్యక్తి వివరాలు నమోదు చేసిన అనంతరం వాక్సిన్ వేసే గదిలోకి పంపించడం జరిగింది. వాక్సిన్ అనంతరం పరిశీలన గదిలోకి పంపించడం జరిగింది. 30 నిమిషాల పరిశీలన అనంతరం ఎటువంటి అవాంఛనీయ లక్షణాలు కనిపించకపోతే వారిని బయటకు విడిచి పెట్టడం జరిగింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక వ్యక్తికి పరిశీలన గదిలో అనారోగ్య పరిస్ధితి ఏర్పడినపుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని కూడా గమనించారు. ఈ ప్రక్రియను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వార్డు, గ్రామ సచివాలయ, అభివృద్ధి విభాగం జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, జెమ్స్ ఆసుపత్రిలో రైతు భరోసా, రెవిన్యూ విభాగం జాయింట్ కలెక్టర్  సుమిత్ కుమార్, పాలకొండలో సమగ్ర గిరిజన ఆభివృద్ధి సంస్ధ ప్రాజెక్టు అధికారి సి.హెచ్.శ్రీధర్ పర్యవేక్షణ చేసారు.       జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద మీడియాకు ప్రక్రియను వివరించారు. జిల్లాలో మూడు ప్రదేశాల్లో డ్రై రన్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. వాక్సినేషన్ కార్యక్రమంలో సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు ప్రణాళికలు చేపట్టుటకు డ్రై రన్ ను నిర్వహించడం జరిగిందన్నారు. సాఫ్ట్ వేర్ లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని భావించామని, దానిలోనూ ఎటువంటి సమస్యలు రాలేదని ఆయన వివరించారు. వాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటగా వైద్య, ఆరోగ్య సిబ్బందికి వాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో 18,700 మంది వైద్య, ఆరోగ్య సంస్ధలలో పనిచేసే సిబ్బందిని నమోదు చేసామని, ఇంకా మిగిలిన వారు ఉంటే వారు కూడా నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. రెండవ దశలో ఫ్రంట్ లైన్ లో పనిచేసిన పారిశుధ్య కార్మికులు, పోలీసులు తదితరులకు., మూడవ దశలో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 50 సంవత్సరాల లోపు వయస్సుగల వ్యక్తులకు, 50 సంవత్సరాలు పైబడి వ్యక్తులకు, గర్భిణీలకు ఇవ్వడం జరుగుతుందని ఆయన చెప్పారు.  తరువాత సాధారణ ప్రజానీకానికి వాక్సిన్ లభ్యతను అనుసరించి విడతల వారీగా అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మొదటి మూడు దశలలో సిబ్బందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలలో వాక్సిన్ ఇచ్చుటకు నిర్ణయించడం జరిగిందని, సాధారణ ప్రజానీకాని జిల్లాలో 2,700 కేంద్రాలలో వాక్సిన ఇచ్చుటకు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. రెండవ దశ సిబ్బంది 20 వేలు, మూడవ దశలో దాదాపు 30 శాతం జనాభాకు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. వాక్సిన్ ప్రక్రియను పర్యవేక్షించుటకు తగిన సిబ్బధిని సైతం నియమించడం జరుగుతుందని అన్నారు. డ్రై రన్ లో భాగంగా ఒక్కో కేంద్రంలో  కనీసం ఐదుగురు సిబ్బందిని నియమించామని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన తెలిపారు.       జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.సి.చంద్ర నాయక్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వాక్సిన్ ఇచ్చుటకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామన్నారు. జిల్లాలో 105 ప్రదేశాల్లో కోల్డు చైన్ పాయింట్లు ఏర్పాటు చేసి అచ్చట నుండి వాక్సిన్ కేంద్రాలకు సరఫరా చేయుటకు చర్యలు చేపట్టామని వివరించారు.       ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి పర్యవేక్షకులు డా.ఏ.కృష్ణమూర్తి, ఆర్.ఎం.ఓ డా.ఆర్.అరవింద్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.ఎల్.భారతీ కుమారి దేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.