అసాధ్యమనుకున్నవాటిని సుసాధ్యం సీఎం జగన్..
Ens Balu
2
Kakinada
2021-01-03 20:53:21
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసాధ్యమనుకున్న వాటినన్నింటినీ సుసాధ్యం చేసి చూపించారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని చీడిగలో ఏర్పాటుచేసిన పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ తదితరులతో కలిసి మంత్రి కన్నబాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి పండగ ముందే వచ్చిందని, పేదలకు సొంతింటి కల సాకారమవుతోందని మంత్రి పేర్కొన్నారు. మనసున్న ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30.75 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను అందిస్తున్నారని.. సంకల్పబలం ఉంటే ఏ స్థాయిలో ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టవచ్చనేదాన్ని ముఖ్యమంత్రి నిరూపించారంటూ ప్రశంసించారు. చీడిగ, ఇంద్రపాలెం, కొవ్వాడ, రేపూరు, గంగనాపల్లి గ్రామాలతో పాటు స్వామినగర్ ప్రాంతానికి చెందిన దాదాపు 3,462 మందికి ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తున్నామన్నారు. వీరికి నేమాంలో అన్ని సౌకర్యాలతో ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న ఆప్షన్ మేరకు ఇళ్లు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల విలువచేసే ఆస్తిని అక్కాచెల్లెమ్మల చేతుల్లో పెడుతున్నామన్నారు. మహిళల పేరిట పూర్తిస్థాయి హక్కులతో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని, అయితే దీన్ని అడ్డుకునేందుకు కొందరు కోర్టులో కేసులు వేశారన్నారు. జాప్యం జరగకూడదన్న ఉద్దేశంలో ప్రస్తుతం ఇళ్ల స్థలాల పట్టాలు అందిస్తున్నామని, సమస్య సమసిపోయాక కోర్టులో తీర్పు అనుకూలంగా వస్తే రిజిస్ట్రేషన్ చేయిస్తామని మంత్రి వివరించారు. భవిష్యత్ తరాల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి పేదలకు సొంతింటిని అందించేందుకు కృషిచేస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఒక అడుగు ముందుకేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో వంద అడుగులు ముందుకేసి ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారన్నారు. బీసీలు అంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్‌బోన్ క్యాస్ట్ అని పేర్కొంటూ ముఖ్యమంత్రి బీసీల అభివృద్ధికి కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల కోసం ఎక్కడా చేయిచాచాల్సిన అవసరం లేకుండా అర్హత ఉంటే చాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే పథకాలు నడిచివెళ్లేలా ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేశారన్నారు. వైఎస్సార్ రైతుభరోసా, జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని రాష్ట్రాలూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా ఇక్కడ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. కులం, మతం, వర్గం అనే తేడాలేకుండా వలంటీర్, సచివాలయ వ్యవస్థల ద్వారా కేవలం అర్హత ప్రాతిపదికగా లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ఫలాలు చేరవవుతున్నాయన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన పట్టాల పండగ మన రాష్ట్రంలో జరుగుతోందని ఎంపీ పేర్కొన్నారు. రాష్ట్రంతో పాటు కాకినాడ గ్రామీణ నియోజకవర్గం అభివృద్ధి దిశగా పయనించేందుకు మంత్రి కురసాల కన్నబాబు కృషిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో కాకినాడ రూరల్ మార్కెట్‌యార్డు ఛైర్మన్ గీసాల శ్రీను, ఎంపీడీవో పి.నారాయణమూర్తి, శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ అనసూరి ప్రభాకర్ తదితరులతో పాటు స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.