వ్యవసాయ పంటలపై ద్రుష్టిపెట్టాలి..
Ens Balu
3
Anantapur
2021-01-03 20:57:04
అనంతపురం జిల్లాలో టమోటా, వేరుశెనగ, చీని తదితర పంటల ఉత్పత్తులకు సంబంధించి చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎంపి తలారి రంగయ్యలు సూచించారు. ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లాలో వివిధ పంటల ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్ లు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్, ఎంపీలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉద్యాన పంటలను 2,02,532 హెక్టార్లలో సాగు చేస్తారని, అందులో టమోటా పంటను 16 వేల హెక్టార్లలో సాగు చేస్తారని, టమోటా పంటకు సంబంధించి 10. 40 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతుందని, ఒక హెక్టార్ కు 40 మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో ఆత్మకూరు, కంబదూరు, కుందుర్పి, బుక్కరాయసముద్రం, తనకల్లు, కదిరి, కళ్యాణదుర్గం, కనగానపల్లి, బొమ్మనహాళ్ లో ఎక్కువ టమోటా సాగవుతుందని, అందులో 448,440, సాహో, అభినవ్ రకాల టమోటా సాగు చేస్తారన్నారు.
ఇక్కడ పండే టమోటా ఉత్పత్తిలో ఎక్కువ శాతం పంట ఎగుమతి అవుతుందని, ధర తక్కువగా ఉన్నప్పుడు రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. కరోనా క్లిష్ట సమయంలో రవాణా సౌకర్యాలు లేక, మద్ధతు ధర లేక రైతులు నష్టపోవాల్సి వచ్చిందన్నారు. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని జిల్లా నుంచి కిసాన్ రైలు ఏర్పాటు చేసి ఢిల్లీకి టమోటా, చీని, బొప్పాయి తదితర రకాల ఉద్యాన ఉత్పత్తులను తరలించామన్నారు. జిల్లాలో రైతుల మేలు కోసం చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాట్లకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకు సంబంధించి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. ఇందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎంపి తలారి రంగయ్య మాట్లాడుతూ జిల్లాలో టమోటా, వేరుశెనగ, చీని ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. చిన్నస్థాయి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు వల్ల రైతులకు ఎక్కువ ధర లభించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో క్లస్టర్ కి ఒక ప్రాసెసింగ్ యూనిట్ ను మొదటిదశలో ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. టమోటా, వేరుశెనగ, చీని ఉత్పత్తులకు అనుగుణంగా ఆయా ప్రాంతాలలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తే రైతుల పంట ఉత్పత్తులకు ఎక్కువ ధర లభిస్తుందన్నారు.
ఈ సందర్భంగా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ టెక్నాలజీస్, మినిమల్ ప్రాసెసింగ్, బేవరేజస్, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ జ్యూస్ పౌడర్స్ తదితర వాటిపై డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్ లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. డిఆర్డిఓ అనుమతితో చిన్న స్థాయి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి అవసరమైన టెక్నాలజీ, సపోర్ట్ ను డిఎఫ్ఆర్ఎల్ అందజేస్తుందని వారు తెలిపారు.
ఈ సమావేశంలో మైసురుకు చెందిన డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్- ఎఫ్ డా.ఆర్.కుమార్, సైంటిస్ట్- ఎఫ్ డా.పి.చౌహన్, సైంటిస్ట్- ఎఫ్ డా.టి.ఆనంద్, సైంటిస్ట్- ఈ డా.రుద్రేగౌడ, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, హార్టికల్చర్ డిడి పద్మలత, కె.వి.కె రెడ్డిపల్లి సైంటిస్ట్ లు జాన్ సన్, సుధ, హార్టికల్చర్ సైంటిస్ట్ దీప్తి, ఆదరణ రామకృష్ణ, రెడ్స్ సంస్థ భానుజ తదితరులు పాల్గొన్నారు.