పరిశోధన ఫలితాలు రైతులకు అందాలి..
Ens Balu
2
Anantapur
2021-01-04 19:11:18
పరిశోధకులు చేసిన ఫలితాలు రైతులు అందేవిధంగా చూడాలని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ శాస్త్రవేత్తలను కోరారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఆవరణంలోని మినీ కాన్ఫరెన్సు హాలులో వ్యవసాయ ఉత్పత్తులకు విలువ పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జెసి డీఎఫ్ఆర్ఎల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వ్యాపారస్తులు, సేవా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. డీఎఫ్ఆర్ఎల్(రక్షణ సంబంధిత ఆహార పరిశోధన ప్రయోగశాల) అధికారులు టమోటా ధర తక్కువగా తక్కువగా ఉన్నప్పుడు రైతులకు గల అవకాశాలను వివరించారు. టమోటా పేస్ట్, టమోటా పొడి, సాస్ వంటి ఉత్పత్తుల తయారీ వల్ల రైతులకు లాభసాటిగా ఉంటుందనీ.. ఆ తయారీకి కావాల్సిన ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు సాంకేతిక సహకారం అందిస్తామని తెలిపారు. ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తున్నందున రైతులకు మేలు జరుగుతుందని వివరించారు.
ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. రానున్న రోజులు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమదేనన్నారు. నీళ్లు కూడా బాటిళ్లలో తాగుతున్న రోజులివి అని గుర్తు చేశారు. వ్యవసాయ రంగాన్ని మరో మెట్టు పైకి ఎక్కించేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయనీ.. రానున్న పది, పదిహేను రోజుల్లో సమగ్ర ప్రాజెక్టు రిపోర్టుతో ముందుకు రావాలని డీఎఫ్ఆర్ఎల్ అధికారులను కోరారు. అనంతరం మాట్లాడిన జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్.. జిల్లాలో నెలకొల్పగలిగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై పదిహేను రోజుల్లో డీపీఆర్ లు సిద్ధం చేయాలని డీఎఫ్ఆర్ఎల్ అధికారులను కోరారు. శాస్త్రవేత్తల పరోశోధనలు మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని సాగించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా వినియోగ దారుడు కోరుకునే వస్తువులను తయారు చేయగలిగినప్పుడే రైతులైనా, వ్యాపారస్తులైనా వాటిని వినియోగించేందుకు ముందుకొస్తారన్నారు. వినియోగదారులు కోరుకోని ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తే మొదటికే మోసం వస్తుందన్నారు.
పరిశోధనా ఫలాలు రైతుకు చేరినప్పుడే రైతు అభివృద్ధి చెందుతాడన్నారు. ఆ దిశగా జరుగుతోన్న మరో ప్రయత్నంలో భాగంగానే డీఎఫ్ఆర్ఎల్ తో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. కిసాన్ రైలు వంటి కార్యక్రమాల ద్వారా మార్కెట్ గురించి జిల్లా యంత్రాంగం కూడా పాఠాలు నేర్చుకుందనీ.. వాటిని కూడా పరిశీలించి జిల్లా రైతులకు ఉపయోగపడే విధంగా డీపీఆర్ లు సిద్ధం చేయాలన్నారు.
రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో పండించే టమోటాను మధ్య ఆసియా దేశాల వంటి టమోటా పండించని దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుగుణంగా 30 నుంచి 40 రోజుల వరకూ నిలవ చేయగలిగే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో సమావేశంలో జిల్లా ప్రజా ప్రతినిధులైన అనంతపురం ఎంపీ తలారి రంగయ్య, రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మైసూరుకు చెందిన డిఎఫ్ఆర్ఎల్ సైంటిస్ట్- ఎఫ్ డా.ఆర్.కుమార్, సైంటిస్ట్- ఎఫ్ డా.పి.చౌహన్, సైంటిస్ట్- ఎఫ్ డా.టి.ఆనంద్, సైంటిస్ట్- ఈ డా.రుద్రేగౌడ, పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ సుదర్శన్ బాబు, ఏపీఎంఐపీ పీడీ సుబ్బరాయుడు, వ్యవసాయ శాఖ జెడి రామకృష్ణ, హార్టికల్చర్ డిడి పద్మలత, కె.వి.కె రెడ్డిపల్లి సైంటిస్ట్ లు జాన్ సన్, సుధ, హార్టికల్చర్ సైంటిస్ట్ దీప్తి, ఆదరణ రామకృష్ణ, రెడ్స్ సంస్థ భానుజ తదితరులు పాల్గొన్నారు.