వ్యవసాయ సదుపాయాలకు నాబార్డు సహాయం..


Ens Balu
2
Srikakulam
2021-01-04 19:27:09

వ్యవసాయ మౌళిక సదుపాయాల కల్పనకు నాబార్డు ఆర్ధిక సహకారాన్ని అందిస్తుందని నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ సుధీర్ కుమార్ జన్నావర్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసిబి)లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆప్కాబ్ మేనేజింగ్ డైరక్టర్ తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీకాకుళంలో రాష్ట్రలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల సమీక్ష జరిగిందని, 2020- 21 సంవత్సరానికి వాటి పనితీరును పరిశీలించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలు (ఆర్.బి.కే) పరిధిలో సౌకర్యాలు కలుగ జేయుటకు రూ.1,426 కోట్లు ఆర్ధిక సహాయాన్ని అందించుటకు నిర్ణయించడం జరిగిందని సుధీర్ కుమార్ తెలిపారు. ఆర్.బి.కేల పరిధిలో గిడ్డంగులు, కోల్డు స్టోరేజిలు తదితర సౌకర్యాల కల్పనకు ఆప్కాబ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుందని ఆయన వివరించారు. డిసిసిబిలు మంచి పనితీరును కనబరిచాయని, సంవత్సరాంతానికి నిర్ధేశిత లక్ష్యాలు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.           ఆప్కాబ్ మేనేజింగ్ డైరక్టర్ డా.ఆర్.శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 2020 – 21 ఆర్ధిక సంవత్సరానికి ఆప్కాబ్ రూ.20 వేల కోట్ల వ్యాపారాన్ని, డిసిసిబిలు రూ.40 వేల కోట్ల వ్యాపారాన్ని చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కరోనా కారణంగా లక్ష్య సాధనలో కొంత జాప్యం జరిగిందని, రానున్న మూడు నెలల కాలంలో లక్ష్యాలు పూర్తి చేయగలమని ఆశాభావం వ్యక్తం చేసారు. ఆర్.బి.కెల పరిధిలో గిడ్డంగులు, కోల్డు స్టోరేజిల నిర్మాణానికి డిసిసిబిలు, పి.ఏ.సిఎస్ లకు ఆప్కాబ్ ద్వారా ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని చెప్పారు. రానున్న రెండు సంవత్సరాల కాలంలో వీటిని పూర్తి చేయగలమని ఆయన పేర్కొన్నారు. జాయింట్ లయబిలిటి గ్రూప్ ల ద్వారా 6 వేల కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు రూ.14 వందల కోట్ల ఆర్ధిక సహాయాన్ని అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది రూ.12,400 కోట్ల పంట రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటి వరకు రూ.7 వేల కోట్ల రుణాలను అందించామని పేర్కొన్నారు. దీర్ఘకాలిక రుణాలను అందించుటకు చర్యలు చేపడుతున్నామని, స్వయం సహాయక సంఘాలు (ఎస్.హెచ్.జి)లకు 9 శాతం వడ్డీ రేటుతోను, ప్రాసెసింగు ఛార్జీలు తగ్గించి మంజూరు చేయుటకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. రూ.2 వేల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు.           శ్రీకాకుళం డిసిసిబి అధ్యక్షులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ కార్యక్రమంలో భాగంగా మోబైల్ ఏటిఎం, పి.ఎ.సి.ఎస్ అభివృద్ధి సెల్ ను ప్రారంభించడం జరిగిందన్నారు. ఎస్.హెచ్.జిలు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్లకు మరింత సహాయాన్ని అందించుటకు చర్యలు తీసుకోవాలని కోరారు. సహకార బ్యాంకు సిబ్బందికి వేతన రివిజన్ ఉదారంగా చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు.           అనంతరం ఎస్.హెచ్.జిలకు, వివిధ సంస్ధలకు ఆర్ధిక సహాయాక చెక్కులను అందజేసారు. ఈ మీడియా సమావేశంలో డిసిసిబి ముఖ్య కార్యనిర్వహణ అధికారి డి.సత్యనారాయణ, ఇన్ ఛార్జ్ జిల్లా సహకార అధికారి కె.మురళీ కృష్ణ మూర్తి, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి మిలింద్ సోవల్కర్ పాల్గొన్నారు. సమీక్షా కార్యక్రమంలో నాబార్డు డిజిఎం లు ఎస్.కె.సాహూ, ఆప్కాబ్ చీఫ్ జనరల్ మేనేజర్ డా.ఎం.రాజేశ్వరి, జనరల్ మేనేజర్లు విజయ భాస్కర రెడ్డి, ఆర్.సురేన్ బాబు తదితరులు పాల్గొన్నారు.